వెనిజులా మీద అమెరికా సాగిస్తున్న రాజకీయ, ఆర్థిక, దౌత్య దాడులు—ఆ దేశ అధ్యక్షుడిని “అనుచితంగా”, “కిరాతకంగా” పట్టుకుని తీసుకెళ్లినట్టుగా ప్రపంచానికి చూపించే కథనాలు—అసలు ప్రశ్నను దాచిపెడుతున్నాయి. ఆ ప్రశ్న ఒక్కటే: ఒక స్వతంత్ర దేశపు ప్రజల రాజకీయ నిర్ణయాలపై మరో దేశం తన శక్తితో జోక్యం చేసుకునే హక్కు ఎక్కడిది? ఇది వెనిజులా సమస్య మాత్రమే కాదు. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య సంస్థలకు, అంతర్జాతీయ క్రమానికి ఎదురైన మౌలిక సవాల్.
ఒక దేశాన్ని ఒంటరిగా నిలబెట్టి, ఆర్థికంగా శిక్షించి, రాజకీయంగా కూల్చివేయడానికే ఇవి ఉపయోగపడుతున్నాయా? అనే ప్రశ్న తప్పనిసరిగా ఎదురవుతుంది. అంతర్జాతీయ చట్టం అన్నది శక్తివంతులకు వర్తించని, బలహీనులకు మాత్రం గట్టిగా వర్తించే నియమావళిగా మారిపోయిందా? ఒక శక్తివంత దేశం ఆంక్షలు విధిస్తే అవి “నైతిక చర్యలు”. అదే చిన్న దేశం ఎదురు తిరిగితే అది “అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన” ఈ ద్వంద్వ ప్రమాణాలే వెనిజులా వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మానవ హక్కుల పేరుతో రాజకీయ నాటకం, వెనిజులాలో మానవ హక్కుల పరిస్థితిపై విమర్శలు ఉంటాయి. కానీ ఒక మౌలిక ప్రశ్న ఇక్కడ దాచిపెడుతున్నారు, ఆంక్షల వల్ల ఔషధాలు రాకపోవడం, ఆహారం కొరతపడటం, వైద్య వ్యవస్థ దెబ్బతినటం—ఇవన్నీ మానవ హక్కుల సమస్యలే. కానీ ఈ సమస్యలను సృష్టించిన విధానాలపై మానవ హక్కుల రక్షకులు ఎందుకు మౌనంగా ఉంటారు?మానవ హక్కులు అంటే కేవలం ప్రభుత్వాలపై ఆరోపణలేనా? లేక ప్రజల జీవన హక్కును కాపాడటం కూడా దాని భాగమేనా? ఇక్కడ మానవ హక్కులు ఒక ఎంచుకున్న అంశంగా మారాయి. అవసరమైతే ప్రస్తావిస్తారు, అవసరం లేకపోతే మరిచిపోతారు. ఇది నైతికత కాదు—రాజకీయ వ్యూహం.
అంతర్జాతీయ సంస్థలు:
స్వతంత్రమా, ఒత్తిడిలోనా?
అంతర్జాతీయ వేదికలైన United Nations, మానవ హక్కుల మండళ్లు, న్యాయ సంస్థలు—వీటి పాత్ర ఏమిటి? వెనిజులా విషయంలో వీటి మౌనం గమనించదగినది. ప్రపంచ సంస్థలు శక్తివంతుల ఒత్తిడికి లోనవకుండా, సార్వభౌమత్వం, ప్రజల సంకల్పం అనే మూల సూత్రాలను కాపాడితేనే వాటి విశ్వసనీయత నిలబడుతుంది. లేనిపక్షంలో, అంతర్జాతీయ వ్యవస్థపై విశ్వాసం పూర్తిగా కూలిపోతుంది.వెనిజులా ఈ రోజు ఒక దేశం మాత్రమే కాదు; కొన్ని సందర్భాల్లో స్పష్టమైన జోక్యం అవసరమైనా, శక్తివంతుల ఒత్తిడి ముందు ఈ సంస్థలు బలహీనంగా మారుతున్నాయి.అంతర్జాతీయ చట్టం అమలు కావాలంటే, అది అందరికీ సమానంగా ఉండాలి. కానీ వాస్తవం వేరేలా ఉంది. శక్తివంత దేశాలు నియమాలు రాస్తాయి, బలహీన దేశాలు వాటిని అనుసరించాల్సిందే. ఈ వ్యవస్థలో న్యాయం ఒక సూత్రం కాదు—ఒక సౌకర్యం.వెనిజులాపై జరుగుతున్న దాడుల పట్ల ప్రపంచంలోని చాలా దేశాలు మౌనంగా ఉన్నాయి. ఆ మౌనం నిర్లక్ష్యమా? లేక భయమా? లేదా తమ తమ ఆర్థిక–రాజకీయ ప్రయోజనాలేనా? చాలా దేశాలకు తెలుసు—ఈ రోజు వెనిజులా. రేపు అదే పద్ధతి తమ మీద కూడా వర్తించవచ్చు. అయినా ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ప్రపంచ వ్యవస్థ ఒక రకమైన భయ రాజకీయం మీద నడుస్తోంది. ఎదురు మాట్లాడితే ఆంక్షలు, వాణిజ్య ఒత్తిళ్లు, రాజకీయ ఒంటరితనం—ఇవి తప్పవు. ఈ మౌనం చివరికి అందరికీ ప్రమాదకరం. ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం కూడా ఒక రకమైన భాగస్వామ్యమే. అది ప్రపంచాన్ని ప్రశ్నిస్తోంది.“ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?” “అది ప్రజలదా, లేక శక్తివంతులదా?” ఈ ప్రశ్నకు ప్రపంచం ఇచ్చే సమాధానంపైనే రేపటి అంతర్జాతీయ క్రమం ఆధారపడి ఉంటుంది.
భారత్ వంటి దేశాలు సహితం….. ?
వెనిజులా మీద జరుగుతున్నది ఒక దేశపు రాజకీయ సంక్షోభం మాత్రమే కాదు. అది ప్రపంచ ప్రజాస్వామ్యానికి, అంతర్జాతీయ న్యాయానికి, మానవ హక్కుల నైతికతకు అద్దం.
ఆ అద్దంలో మనం చూసేది అందంగా లేదు.వెనిజులా కథ భారత్ వంటి దేశాలకు కూడా ఆలోచనకు దారితీయాలి. ఈ రోజు మనం పెద్ద దేశం కావచ్చు. కానీ అంతర్జాతీయ క్రమంలో శక్తి సమీకరణాలు మారితే, అదే ఆయుధాలు మన మీద కూడా ప్రయోగించబడవచ్చు. స్వతంత్ర నిర్ణయాలు, వ్యూహాత్మక స్వావలంబన, బహుళ ధ్రువ ప్రపంచ క్రమానికి మద్దతు—ఇవి సిద్ధాంతాలు మాత్రమే కాకుండా అవసరాలు. వెనిజులా సంఘటనలు చెబుతున్న పాఠం ఇదే.ప్రజాస్వామ్యం ఒక నినాదంగా మిగిలిపోతే, ప్రజల నిర్ణయాలకు విలువ లేకపోతే, అంతర్జాతీయ చట్టం శక్తివంతుల చేతిలో ఆయుధంగా మారితే—ఈ ప్రపంచం మరింత అస్థిరంగా మారుతుంది. వెనిజులా ఈ రోజు బాధితుడు. కానీ ఈ ధోరణి ఆగకపోతే, రేపు బాధితుల జాబితాలో మనతో సహా మరిన్ని దేశాలు కూడ చేరిపోయే అవకాశాన్ని కొట్టి పారేయలేం సుమా !
మౌనం వీడాల్సిన సమయం…
వెనిజులా అనుభవం గ్లోబల్ సౌత్ దేశాలకు ఒక స్పష్టమైన హెచ్చరిక. వెనిజులా సంఘటనలు గ్లోబల్ సౌత్ దేశాలకు ఒక అద్దం. ఈ రోజు మౌనంగా ఉంటే, రేపు అదే విధానం తమ మీద వర్తించదని ఎవరూ హామీ ఇవ్వలేరు. సహజ వనరులు మీవైనా, నిర్ణయాలు మీవిగా ఉండనివ్వరు—అవి శక్తివంతులకు అనుకూలంగా లేకపోతే. ఆర్థిక స్వావలంబన, స్వతంత్ర విదేశాంగ విధానం, ప్రజల కేంద్రంగా అభివృద్ధి—ఇవన్నీ నినాదాలుగా మిగిలిపోతాయి, అవి ప్రపంచ శక్తుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే. వెనిజులా ఈ సత్యాన్ని ఖరీదైన మూల్యంతో నేర్చుకుంటోంది. అందుకే గ్లోబల్ సౌత్ దేశాలు కలిసి ఒక స్పష్టమైన స్థానం తీసుకోవాలి:
ఆంక్షల రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల నిర్ణయాలకు గౌరవంగా, బహుళ ధ్రువ ప్రపంచ క్రమానికి మద్దతుగా, ఇది కేవలం వెనిజులా పక్షపాతం కాదు—తమ భవిష్యత్తును రక్షించుకునే చర్య.
మీడియా బాధ్యత: కథనాల నుంచి సత్యం వైపు, వెనిజులా విషయంలో మీడియా తన పాత్రను తిరిగి సమీక్షించుకోవాలి. ఒకే కోణం, ఒకే కథనం, ఒకే నింద—ఇవి ప్రజలను సత్యానికి దగ్గర చేయవు.
మీడియా ప్రశ్నించాల్సింది ఇది, ఆంక్షల ప్రభావం ఎంత? విదేశీ జోక్యం ఎంత? ప్రజల అసలైన స్వరం ఏమిటి?సత్యం ఒక పక్షాన మాత్రమే ఉండదు. దాన్ని కనుగొనాలంటే విభిన్న స్వరాలకు స్థానం ఇవ్వాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం తిరిగి బలపడుతుంది.కొత్త ప్రపంచ నైతిక క్రమం అవసరం, వెనిజులా సంక్షోభం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది: పాత ప్రపంచ క్రమం చీలిపోతోంది. శక్తివంతుల ఇష్టానుసారంగా నడిచే వ్యవస్థ ఇక పనిచేయడం లేదు.అవసరం ఏమిటంటే—సార్వభౌమత్వానికి నిజమైన గౌరవం, ప్రజల సంకల్పాన్ని కేంద్రంగా పెట్టే ప్రజాస్వామ్య ఆంక్షలు, బెదిరింపుల స్థానంలో సంభాషణ, ఇవి లేకుండా ప్రపంచ శాంతి ఒక కలగానే మిగిలిపోతుంది.
దారి ఏది ?
వెనిజులా సంక్షోభానికి మొదటి, మౌలిక పరిష్కారం ఆంక్షల ఉపసంహరణ. ఆర్థిక ఆంక్షలు ప్రభుత్వాన్ని కాదు—ప్రజలను శిక్షిస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తే, ప్రజాస్వామ్యం బలపడదు; అది మరింత బలహీనపడుతుంది. ప్రజాస్వామ్య మార్పులు కావాలంటే, అవి సంభాషణ ద్వారా రావాలి. దేశంలోని రాజకీయ వర్గాల మధ్య, పౌర సమాజం మధ్య, అంతర్జాతీయ మధ్యవర్తుల సమక్షంలో జరిగే చర్చలే స్థిర పరిష్కారానికి దారి తీస్తాయి. బాంబులు, ఆంక్షలు, అరెస్టు బెదిరింపులు—ఇవి మార్పు తీసుకురావు.
అంతర్జాతీయ సమాజం పాత్ర, నిష్పాక్షికత అవసరం, అంతర్జాతీయ సమాజం—ప్రత్యేకించి United Nations—వెనిజులా విషయంలో ఒక కీలక బాధ్యత వహించాలి. కానీ ఆ బాధ్యత అంటే ఒక పక్షాన్ని ముద్రవేయడం కాదు; నిష్పాక్షికంగా మధ్యవర్తిత్వం చేయడం. వెనిజులా గాయాలు మానాలంటే, ప్రపంచం తన అంతరాత్మను పరిశీలించుకోవాలి.ప్రజాస్వామ్యం నిజంగా ప్రజలదైతే—వెనిజులా ప్రజల నిర్ణయానికి గౌరవం ఇవ్వాల్సిందే.అది ఇవ్వకపోతే, ప్రజాస్వామ్యం అనే పదం చరిత్రలో మరో ఖాళీ నినాదంగా మిగిలిపోతుంది.
డాక్టర్ కేశవులు భాషవత్తిని. ఎండీ.
చైర్మన్ : తెలంగాణ మేధావుల ఫోరం.
8501061659.







