T.టైమ్స్ ప్రతినిధి.నిజామాబాద్ : తెలంగాణలో 43 లక్షల పైగా జనాభా గల పద్మశాలి చేనేత కులస్తులను చాలా ప్రభుత్వాలు పట్టించుకోక నిర్లక్ష్యం చేశాయని, ఫలితంగానే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆకలి చావులతో మరణించారని, సమాజాన్ని ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుని వదిలేస్తున్నారని , భవిష్యత్తులో ఇక ఎంత మాత్రము సహించబోమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు ఓట్లు అడిగే రాజకీయ పార్టీలను తీవ్రంగా హెచ్చరించారు.
నిజామాబాద్ నగరంలో పూలంగ్ చౌరస్తాలో గల విజయలక్ష్మి గార్డెన్ లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి సమక్షంలో ఆదివారం రాత్రి జరిగిన భారీ సంఖ్యలో హాజరైన పద్మశాలి ఆత్మీయుల సమ్మేళనం లో డాక్టర్ కేశవులు ప్రసంగించారు.
అనాదిగా బీసీలకు అన్యాయం జరుగుతుందని, అందులో పద్మశాలీలకు మరింత అన్యాయం జరుగుతుందని, రాజకీయ ప్రాతినిథ్యం లేకుండా పద్మశాలీలు ముందడుగు వేయడం చాలా కష్టమని, ఎన్నికలప్పుడు మాత్రమే పద్మశాలీల గురించి మాట్లాడతారని, ఎన్నికలయ్యాక అసలు పట్టించుకునే నాధుడే లేరని డాక్టర్ బి కేశవులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం MLC , రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల్లో తగినంత ప్రాతినిధ్యం ఇవ్వ కుంటే తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని డాక్టర్ బి కేశవులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి టీ జీవన్ రెడ్డి , MLC మహేష్ కుమార్ గౌడ్, సభాధ్యక్షులు- మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, పద్మశాలి జిల్లా అధ్యక్షులు దత్తాద్రి ,గౌరవ అధ్యక్షులు యాదగిరి, కార్యనిర్వాక అధ్యక్షులు హనుమాన్లు, సెక్రెటరీ గంగదాస్, నగర పద్మశాలి అధ్యక్షులు గుజ్జేటి నరసయ్య, డాక్టర్ శివప్రసాద్, అమృత పూర్ గంగాధర్, గుడ్ల భూమేశ్వర్ , బింగి మోహన్ ఇతర సంఘ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,