ఓటు కోసం కోటి తిప్పలు. అందుకే.. ఓట్ల ఆటలో కొత్తకొత్త వెర్షన్స్ పుట్టుకొస్తున్నాయి. అందితే జుట్టు పట్టుకోవడం.. పొట్టుపొట్టు తిట్టుకోవడం.. అందకపోతే దారి మార్చి.. గుళ్లో దూరి దేవుడి కాళ్లు పట్టుకోవడం.. అవసరాన్ని బట్టి దేవుడి మీదే ఒట్టేసి జనం సెంటిమెంట్‌తోనే గేమ్స్ ఆడుకోవడం. ప్రస్తుతానికి దేవుడి చుట్టూనే చక్కర్లు కొడుతోంది తెలుగు రాజకీయం. దీనికి పరాకాష్ట ఏంటంటే.. దేవుడినే అంపైర్‌గా పెట్టి జరుగుతున్న పొలిటికల్ ఫీట్లు
అయోధ్య రామయ్యతో మొదలు పెడితే గ్రామ దేవుళ్ళ వరకూ.. ఇక్కడ ఎవ్వరికీ మినహాయింపుల్లేవు. పొట్టుపొట్టు తిట్టుకుంటూ.. తిట్లతోనే ఓట్లు కురుస్తాయన్న భ్రమల్లోనే బతికేసిన రాజకీయాలోళ్లు ఆ రొటీన్ ఫీట్లతో బోరెత్తిపోయి అలసితి-సొలసితి అంటూ అంతర్యామి చెంతకు చేరుకోవడం.. దేవుడి మీద ఒట్లేసి జనంలోని డివైన్ సెంటిమెంట్‌ను మేల్కొలిపి.. ఆ విధంగా శాటిస్‌ఫ్యాక్షన్లు పొందడం కామన్. ఇప్పుడైతే వీళ్లు ఒట్లతో పోటెత్తడం చూస్తుంటే.. దేవుడి మీద డిపెండెన్సీలు బాగా ఎక్కువైపొయ్యాయా అనేవి మనకొచ్చే డౌట్లు.
జనంలో దేవుడి సెంటిమెంట్‌ను ఎంత కదిలించారో ఏమో గానీ.. ఓట్ల కోసమే ఈ ఒట్ల రాజకీయం.. అనే విమర్శలకైతే దొరికిపోతోంది రేవంత్ సర్కార్. రేపటిరోజున నీ ఒట్లు తీసి గట్టున పెడితే.. ఆనక మా దేవుళ్లేమవ్వాలె.. అనే రివర్స్ సెంటిమెంట్లు కూడా లేకపోలేదు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చెయ్యలేక.. ప్రజల్లో చులకనైపోయి.. వ్యతిరేకత మూటగట్టుకుని, దాన్నుంచి తప్పించుకోడానికి, లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా లబ్ది పొందడానికే రేవంత్‌రెడ్డి ఇలా గుడి బాట పట్టారా… అనేవి అపోజిషన్ సైడ్ నుంచి వినబడే రెడీమేడ్ సందేహాలు. అధికార పార్టీలో అభద్రతాభావం పెరిగిందా… అందుకే ఇలా జనంలో ఆధ్యాత్మిక భావన మీద ఆధారపడుతోందా.. అనే సందేహాలు ఇలా ఉండగానే.. ప్రమాణాల సీజన్ కొత్త మలుపు తిరిగింది. పంద్రాగస్టున జరగబోయే రుణమాఫీపై తెలంగాణ అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం రా అంటూ గన్‌పార్క్ వైపు టర్న్ ఇచ్చుకున్నాయి పార్టీలు. బాసర సరస్వతిపై ఒట్టేసి ఒకసారి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై మరోసారి, జోగులాంబ సాక్షిగా.. ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా.. భద్రాద్రి రామయ్య సాక్షిగా.. రామప్ప-శివుడి సాక్షిగా… ఇలా అన్ని గుళ్లూ ఓ రౌండెయ్యడం ఐపోయిందనుకున్నారో ఏమో.. గన్‌పార్క్ అమరవీరుల స్థూపం దాకా నడిచొచ్చింది రాజకీయ నాయకుల ఒట్లు, ప్రమాణాల పర్వం. సెంటిమెంట్ బాబూ సెంటిమెంట్.. ఎప్పుడే సెంటిమెంట్ వర్కవుటౌతుందో ఎవ్వరికెరుక?