Dr keshavulu MD psy Osm. Chairman : Telangana Intellectuals Association
ప్రస్తుతం నెలకొన్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ (iran israel war) పరిస్థితులు ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం , దానికి ప్రతిగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులతో అంతర్జాతీయ చమురు మార్కెట్ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) మార్గంలో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు భారత్‌ను వణికిస్తున్నాయి.
భారత్‌కు ఎందుకు ముప్పు?
భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 50 శాతం అంటే రోజుకు సుమారు 2.6 మిలియన్ బ్యారెళ్లను ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ ఈ యుద్ధం కారణంగా ఈ సముద్ర మార్గం మూతపడితే, భారత్‌కు చమురు సరఫరా నిలిచిపోవడమే కాకుండా, దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. ప్రతి 10 డాలర్ల చమురు ధర పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరగనున్న ధరలు.. తగ్గనున్న వృద్ధి!
కునాల్ సోధాని వంటి ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, చమురు ధరలు 25 శాతం పెరిగితే భారత దిగుమతి బిల్లుకు అదనంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) భారం పడుతుంది. దీనివల్ల..
ద్రవ్యోల్బణం: దేశంలో ధరలు 0.7 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
జీడీపీ: భారత ఆర్థిక వృద్ధి రేటు (GDP) 0.2 శాతం తగ్గే ప్రమాదం ఉంది.
కరెంట్ అకౌంట్ డెఫిసిట్: మన దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగి లోటు 0.3 శాతం పెరుగుతుంది.
ఏయే రంగాలపై ప్రభావం ఉంటుంది?
ముడి చమురు ధరలు పెరిగితే కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా అనేక రంగాలు ప్రభావితమవుతాయి..
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs): ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి కంపెనీల లాభాలు తగ్గుతాయి.
ఏవియేషన్ & లాజిస్టిక్స్: విమాన ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రయాణ ఖర్చులు భారమవుతాయి.
పెయింట్స్ & ఆటోమొబైల్: ముడి పదార్థాల ధరలు పెరిగి ఈ కంపెనీల మార్జిన్లు పడిపోతాయి.
ఐటీ రంగం: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత వల్ల ఐటీ స్టాక్స్‌లో ఒడిదుడుకులు రావచ్చు.
సౌదీ అరేబియా ఆశ కిరణం?
ప్రస్తుతానికి ఒపెక్ (OPEC+) దేశాల వద్ద అదనపు చమురు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అవసరమైతే ఉత్పత్తిని పెంచుతామని సౌదీ అరేబియా సూచనప్రాయంగా తెలిపింది. దీనివల్ల ధరలు ఒకేసారి పెరిగినా, ఎక్కువ కాలం అదే స్థాయిలో ఉండకపోవచ్చని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం , ఖర్చు అవుతుంది.
మార్కెట్లపైనే అందరి కళ్లు…
ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధం (iran israel war) నేపథ్యంలో సోమవారం మార్కెట్లు ప్రారంభమయ్యే సమయానికి తీవ్రమైన ఒడిదుడుకులు (Volatility) ఉండవచ్చు. కేవలం చమురు ధరలే కాకుండా, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయుల భద్రత , అక్కడి నుండి వచ్చే రెమిటెన్స్‌లు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం , ఆర్బీఐ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. యుద్ధం ముదిరితే మాత్రం సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.







