ఈమధ్య తెలంగాణ రాష్ట్రం లో మేధావుల పేరుతో వరుసగా సమావేశాలు జరుగడం, అవి కూడా భారీ అంచనాల నేపథ్యంలో విజయవంతం కావడం తెలిసిందే. ఈ నెల 14 వ తారీఖున హైదరాబాదు నగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు ఆధ్వర్యంలో బీసీ బడ్జెట్ – సంక్షేమం అంశం పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి భారీ సంఖ్యలో యువత పాల్గొనడం, చాలా తెలుగు ఛానెళ్లు లైవ్ కవరేజ్ తో పాటు అన్ని ప్రింట్ మీడియాలు మంచి కవరేజ్ ఇవ్వడం తెలిసిందే .
ఆ తర్వాత టి. చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో 30 తారీఖున హైదరాబాదు నగరంలోని లోని బంజారహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో బీసీ మేధావుల సమావేశం జరుగడం, ఆ సమావేశానికి కూడ ఊహించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో బీసీ కులాల నాయకులు, వివిధ సంఘాలు రావడం.. అంతే కాకుండా ప్రజాప్రతినిధులు మేధావులు లాయర్లు డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సమావేశాల వెనుక ఏదో భారీ ఉద్యమ కార్యాచరణ ఉందనే సంకేతాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలకు చేరిందనే సమాచారం, గతంలో కూడా మేధావుల పేరుతో జరిగిన చాలా సమావేశాల తర్వాతే చివరికి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాయని…. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావచ్చనే అనుమానం రెండు జాతీయ పార్టీలకు వచ్చిందట .
అంతేకాకుండా మాట్లాడిన వక్తల ధోరణి చూశాక కచ్చితంగా బీసీలు ఐక్యం గాబోతున్నారనే నిర్ధారణ కు వచ్చారని, ఇవి ఒక పార్టీగా అవతరిస్తే జాతీయ పార్టీలకు భవిష్యత్తులో కష్టమేనని, ప్రాంతీయ పార్టీలు వస్తే దక్షిణ భారతదేశంలో జాతీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదనే భయము ఆ పార్టీలో ఉంది. అందుకనే ఈ మధ్య జరిగిన సమావేశాలపై కేంద్ర రాష్ట్ర ఇంటలిజెన్స్ సంస్థలు ప్రత్యేకంగా నిఘా పెట్టడమే కాకుండా లోతుగా అధ్యయనం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తే తమిళనాడు లాంటి పరిస్థితి ఎదురు కావచ్చని రెండు జాతీయ పార్టీల ఆలోచనగా చెబుతున్నారు.