ప్రపంచం డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తున్న కాలంలో ఆరోగ్య రంగం కూడా టెక్నాలజీ స్పర్శకు లోనైంది. అయితే ఆ స్పర్శ శుభదాయకమా? ప్రమాదకరమా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రత్యేకంగా, “గూగుల్ డాక్టర్” కల్చర్ వల్ల సామాన్యుల ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతోంది. ఒక్క క్లిక్ తో నెట్లో ఏ వ్యాధికి అయినా సమాచారం దొరికే ఈ కాలంలో ప్రజలు అసలు డాక్టర్ అవసరమా? అన్న దాకా ఆలోచిస్తున్నారు. ఇదే ప్రమాదకరమైనా మలుపు. ప్రపంచ గ్లోబలీకరణంతరం ప్రజలు తమ శరీరాన్ని ప్రయోగశాలలా మార్చుకుంటున్నారు. గూగుల్ చెప్పినది శాసనమై, తాము చూసినది ఔషధంగా మార్చుకుంటున్నారు. ఫలితంగా మరెన్నో చిక్కులో తెలియకుండానే పడిపోతున్నారు.
గూగుల్ డాక్టర్ – పుట్టుక…
“గూగుల్ డాక్టర్” అన్న పదం 2010 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి గూగుల్‌లో శోధించి, అక్కడ వచ్చిన సమాచారం ఆధారంగా సొంత వైద్యం మొదలుపెట్టడం ఈ సంస్కృతి మూలం. “ఇంటర్నెట్ మెడిసిన్” అనే కొత్త దారిలో ఈ శోధనలు మానవ నైజాన్ని మార్చాయి. పిల్లల నుంచి వృద్ధుల దాకా, నగరం నుంచి పల్లె దాకా ప్రతి వయస్సు వారూ ఈ గూగుల్ డాక్టర్‌ను ఆశ్రయించడం ప్రారంభించారు. ముఖ్యంగా COVID-19 లాంటి ప్రపంచ వ్యాధుల తర్వాత ప్రజల్లో ఆసుపత్రుల పట్ల భయం, ఖర్చుల భారం, ఆసుపత్రుల్లో బెడ్ల కొరత వంటివి ఈ టెక్నాలజీ వైద్యాన్ని ఆశ్రయించేలా చేశాయి.సాధారణంగా పిల్లలకు జ్వరం,పాఠశాల విద్యార్థులకు ఉదర సమస్యలు, వాంతులు వంటి లక్షణాలు వచ్చినపుడు, అదే విధంగా వృద్ధులకు సైతం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లే శక్తి లేక గూగుల్ ఆధారంగా మందులు వాడటం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తున్నాయి.
సొంత వైద్యం వెనుక మానసికత…
సైబర్‌కాండ్రియాసిస్ (Cyberchondriasis) అనేది మానసిక నిపుణుల ప్రకారం, ఒక రకమైన ఆరోగ్య భయం. చిన్న జ్వరానికి కూడా నెట్‌లో వెతికి చూసి, అది కేన్సర్ అయి ఉండొచ్చునని భయపడే స్థితికి చేరడం. ఇది తీవ్ర మానసిక భయాన్ని కలిగిస్తుంది. ఈ తత్త్వాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు, తలనొప్పి → గూగుల్ శోధన → బ్రెయిన్ ట్యూమర్? వాంతులు → గూగుల్ శోధన → ఫుడ్ పోయిజనింగ్? ఇలా, అసలు సమస్య కన్నా భయం పెద్దదిగా మారుతుంది. చివరికి అది మానసిక ఆందోళన, డిప్రెషన్, ఇన్సోమ్నియా వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇంకొందరిలో గూగుల్‌లో శోధన చేయడానికి అనవసరంగా డాక్టర్ ఫీజు ఇవ్వడం వృదా అనే బావన, ,ఆసుపత్రికి వెళ్లడానికి సమయాభావం, కొందరి అసమ్మతి లేదా మానసిక భయం (Hospital anxiety), వ్యక్తిగత అహం – “నాకే తెలిసి ఉంటుంది” అనే భావనలతో google డాక్టర్ పై ఆధారపడి బతుకు బస్టాండ్ చేసుకుంటారు.
దేశంలో గణాంకాలు..
భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 20 కోట్ల మంది గూగుల్ ఆధారంగా ఆరోగ్య సంబంధిత సమాచారం చూస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అందులో 60% మంది వారు చూసిన సమాచారం ఆధారంగా సొంతంగా మందులు తీసుకుంటున్నట్టు గుర్తించబడింది.గూగుల్ ఆధారంగా మందులు వేసుకునే వయస్సు గణాంకాలు, 15–30 వయస్సు గల వారు 68% మంది, 31–50 వయస్సు గల వారు 59% మంది, 51+ వయస్సు గల వారు 41% కి పైగా వాడుతున్నారు. అలాగే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వల్ల 2024 లో భారతదేశంలో 93,000 మంది మృతి చెందినవారు. రాష్ట్రాల వారీగా గూగుల్ వైద్యం ఆధారిత ఆసుపత్రి చేరికలు 2024 లో తెలంగాణ 1,89,000 మంది, ఆంధ్రప్రదేశ్ లో 63,000 మంది , మహారాష్ట్ర లో 2,10,000 మంది, తమిళనాడు లో 1,78,000 మంది, ఇక కర్ణాటక లో 1,53,000 మంది , అలాగే గూగుల్ డాక్టర్ కల్చర్‌తో జత కలుస్తున్న మరో ప్రమాదకర అంశం – OTC (Over The Counter) ఔషధాల దుర్వినియోగం వినియోగం. పక్కింటి ఫార్మసీలో వెళ్లి, ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకునే సంస్కృతి వేగంగా పెరిగుతోంది. ఈ మందులు, అసలు వ్యాధిని కవర్ చేయవు, కొన్ని లక్షణాలను మాత్రమే తగ్గిస్తాయి కానీ శరీర రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి, లివర్, కిడ్నీ, గుండె వంటి అవయవాలను పలు విధాలుగా ప్రభావితం చేస్తాయి.
వైద్యులపై నమ్మకం తగ్గుతుందా ?
గూగుల్ డాక్టర్ వల్ల, ప్రజలు నేరుగా మానవ వైద్యులను నమ్మకపోవడం మొదలైంది. చాలా మంది పేషంట్లు డాక్టర్ చెప్పిన మందుల కన్నా తాము గూగుల్‌లో చూసిన చికిత్సను ఎక్కువ నమ్ముతున్నారు. డాక్టర్ నుంచి
గూగుల్ డాక్టర్ పై నమ్మకం రోజు రోజుకు పెరిగిపోతోంది. పట్టణ ప్రజలు 72% మంది డాక్టర్లు ను నమ్మగా, 25% మంది గూగుల్ డాక్టర్ పై , అలాగే గ్రామ ప్రజలు 58% డాక్టర్లు ను నమ్మగా, 38% మంది గూగుల్ డాక్టర్ పై విశ్వాసం కలిగి ఉన్నారు. ఇది వైద్య నిపుణుల ప్రాముఖ్యతను తగ్గిస్తుంది. ఈ ధోరణి వ్యాధి నిదానంలో ఆలస్యం, మరణాలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఇది రెండు విధాలుగా మన ఆరోగ్యవ్యవస్థను దెబ్బతీస్తోంది,డాక్టర్లు చెప్పిన మందులు తీసుకోవడం నిరాకరించడం, ప్రయోగాత్మకంగా వేరే చికిత్సలు అనుసరించడం ఇది ఆరోగ్య నైపుణ్యాల విషయంలో తీవ్ర లోటుకు సంకేతం. దీన్ని “Health Literacy Deficiency” అంటారు. భారతదేశంలో 60% మందికి ప్రాథమిక హెల్త్ లిటరసీ కూడా లేదన్నది పరిశోధనల ద్వారా రుజువు అయింది.సోషల్ మీడియా ద్వారా అనుభవం లేని వ్యక్తులు ఆరోగ్య సలహాలు ఇవ్వడం వల్ల ప్రజలు మరింత మాయలో పడుతున్నారు. “3 రోజుల్లో మధుమేహం పోతుంది”, “ఈ రసం తాగితే క్యాన్సర్ మాయం” వంటి బోగస్ వీడియోలు లక్షల్లో వీక్షణలు పొందుతున్నాయి.
ఆరోగ్యం…
డాక్టర్ చేతుల్లో …….
రాబోయే కాలంలో ప్రజలు డిజిటల్ పరిజ్ఞానంతో ఎక్కువగా చైతన్యం పొందినప్పటికీ, అదే పరిజ్ఞానం వక్రీకరితమై తాము డాక్టర్ అనుకోవడం, అర్ధరాత్రి గూగుల్ ఆధారంగా మెడిసిన్ తాగడం వంటి ధోరణులు పెరిగితే ప్రజారోగ్య రంగం సంక్షోభంలోకి వెళ్లడం ఖాయం.గూగుల్ వైద్య విధానం వల్ల సమాజంలో స్థూలంగా ఆరోగ్య సమస్యలు, మరణాల సంఖ్య పెరిగితే ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా మారుతుంది. ప్రజా ఆరోగ్య రంగానికి నిధులు చాలవు. క్షీణత కొనసాగుతుంది. ఆరోగ్యంగా ఉండే హక్కు బలహీనమవుతుంది.
ఇది నివారించాలంటే – ఇప్పుడు చర్యలు తీసుకోవాలి. ప్రజలలో అవగాహన పెంచాలి.ఆరోగ్యం అన్నదే డాక్టర్ చేతుల్లో ఉండాలి,
గూగుల్ చేతుల్లో కాదు…
జీవితం విలువైనది, గూగుల్ కాదు, మీ శరీరం, మీ ఆరోగ్యం గూగుల్‌లోని మినీ సమాచారం ఆధారంగా నిర్ణయించబడదగినది కాదు.వైద్య విద్యార్థి కావాలంటే 6 ఏళ్ళు చదవాలి, అనుభవాన్ని సంపాదించాలి. గూగుల్‌లో రెండు నిమిషాల శోధనతో డాక్టర్ అవ్వలేం. సాంకేతికత మనకు సేవ చేసేదిగా ఉండాలి, మన ప్రాణాలను ప్రమాదంలో పెట్టేదిగా కాదు. మన ఆరోగ్యానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో మనం గూగుల్‌ను ఆధారంగా కాకుండా, ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించాలి. మీ ప్రాణం విలువైనది – దానిని గూగుల్ చేతిలో పెట్టకండి. నిజమైన వైద్యులే మనకు రక్షకులు అనే సందేశం నేటి నుంచే అందించాలి.
పరిష్కార మార్గాలు –
భారతదేశంలో ఇప్పటిదాకా డిజిటల్ హెల్త్ కంటెంట్‌పై నియంత్రణలేని పరిస్థితి. ఆన్‌లైన్‌లో ఆరోగ్య సమాచారాన్ని ప్రసారం చేసే ప్లాట్‌ఫామ్స్‌కు సర్టిఫికేషన్ అవసరం లేదు. ఇవన్నీ ఔషధ నియంత్రణ మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చినా, సరైన చర్యలు ఉండకపోవడం వల్ల ఇది ఆపదల బాటగా మారుతోంది.ఈ వెబ్‌సైట్లలో డాక్టర్లు కాకపోయినా సూచనలు వస్తుండడం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మరింత ప్రమాదకరంగా, టిక్‌టాక్ డాక్టర్లు, యూట్యూబ్ హీలర్స్ వంటి అనుభవం లేని వ్యక్తులు మానసిక, శారీరక చికిత్సలు సూచిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇందుకోసం ప్రజలలో అవగాహన పెంపొందించాలి, సాధారణ ప్రజలకు హెల్త్ లిటరసీ పెంచాలి. ప్రతి బస్తీలో, గ్రామంలో ఆరోగ్య అవగాహన సదస్సులు అవగాహన శిబిరాలు నిర్వహించాలి, ఆరోగ్య సాక్షరత ప్రచారం, టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా ద్వారా అధికారిక సమాచార పంపిణీ చేయాలి.ఆరోగ్య సంబంధిత కంటెంట్ పైన ఫ్యాక్ట్ చెకింగ్ ఉండాలి. OTC మందుల అమ్మకంపై నియంత్రణలు ఫార్మసీ నియంత్రణలు ఉండాలి.నకిలీ వీడియోల తొలగింపు, డిజిటల్ మీడియా నియంత్రణ చట్టానికి మార్పులు,యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్‌పై ఆరోగ్య విభాగాల చట్టం అమలు చేయాలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గుణాత్మకత మరియు వైద్యుల నియామకం చేపట్టాలి.
డా. కేశవులు భాషవత్తిని, ఎండి. సైకియాట్రి. సీనియర్ మానసిక వైద్య నిపుణులు.