వైశ్య వ్యాపారులు” అంటే ఆర్థిక భరోసా.అమ్మే వాళ్లే కాదు, పల్లె ప్రజల ఆర్థిక భద్రతకు రక్షకులు.
డా. కేశవులు భాషవత్తిని. ఎండి. సైకియాట్రీ .
చైర్మన్ : తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659.
తెలంగాణ పల్లెలో ఉదయం మార్కెట్ శబ్దాలు, గడ్డిపూల సువాసనలు, చిన్న వ్యాపారుల పిలుపులు ,ఇవన్నీ ఒకప్పుడు గ్రామీణ జీవన శైలిలో విడదీయరాని భాగం. ప్రతి పల్లెలో ఒక పల్లె బజార్ ఉండేది. బియ్యం, పప్పులు, నిత్యావసరాలు, చేనేత వస్త్రాలు, ఇవన్నీ గ్రామంలోనే లభించేవి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు “వైశ్య వ్యాపారులు” అంటే ఆర్థిక భరోసా. కేవలం సరుకులు అమ్మే వాళ్లే కాదు, పల్లె ప్రజల ఆర్థిక భద్రతకు రక్షకులు. ఎవరైనా రైతు పంట విఫలమైతే, లేదా ఎవరికైనా అనారోగ్యం వస్తే, బ్యాంకులు కాకుండా ముందుగా పల్లె వ్యాపారి దగ్గరికి వెళ్లేవారు. ‘తప్పనిసరిగా సహాయం చేస్తారు’ అన్న నమ్మకం ఉండేది. ఆ సహాయం కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, గోధుమలు అప్పుగా ఇవ్వడం, సీజన్ ముగిసాక చెల్లించమని చెప్పడం, అవసరమైతే వడ్డీ కూడా మాఫీ చేయడం. ఈ నమ్మకమే పల్లె ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం. కానీ… ఈ ఊపిరి ఇప్పుడు క్రమంగా ఆగిపోతోంది.
పల్లె గుండె చప్పుడు –
తెలంగాణలో పల్లె బజార్ అనేది కేవలం కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాదు, అది ఒక సమాజపు ఆర్థిక గుండె చప్పుడు. ఒకప్పుడు ప్రతి పల్లెలో “బజార్ రోజు” అంటే పండుగ వాతావరణం. స్థానిక వైశ్యులు (బనియాలు) ప్రతి ఇంటికి సరుకులు అందించేవారు. ధనస్రావంతి పల్లె గుండా పారినట్లుగా, వ్యాపారం గ్రామం గుండెల్లో ప్రవహించేది. కానీ గడచిన రెండు దశాబ్దాల్లో ఈ దృశ్యం పూర్తిగా మారిపోయింది. స్థానిక వ్యాపారులు తగ్గిపోవడం,మార్వాడి వ్యాపారుల పెరుగుదల, ప్రభుత్వ నిర్లక్ష్యం, పెద్ద రీటైల్ చైన్లు, ఆన్‌లైన్ షాపింగ్ (Amazon, Flipkart), క్విక్-డెలివరీ యాప్స్ (Blinkit, Zepto) కూడా గ్రామీణ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇవన్నీ కలిసి పల్లెల ఆర్థిక శ్వాసను బిగించాయి. పల్లె వ్యాపారం కూలిపోతే, పల్లె ఆర్థిక వ్యవస్థ కూడా కూలిపోతుంది. ఎందుకంటే రైతు పంటను అమ్ముకోవడానికి, పంటకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనడానికి, కుటుంబానికి అవసరమైన రోజువారీ సరుకులు పొందడానికి , పల్లె వ్యాపారం తప్ప వేరే మార్గం ఉండదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మార్వాడీల ప్రవేశం, రుణపద్ధతుల మార్పు, బ్యాంకుల కఠిన నిబంధనలు, మరియు ఆధునిక రిటైల్ దుకాణాల పెరుగుదల, ఈ కలయిక వల్ల గ్రామీణ వైశ్య వ్యాపార వ్యవస్థ నెమ్మదిగా కూలిపోయింది.
మార్వాడి వ్యాపారుల ప్రవేశం –
1990ల తర్వాత, ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛ (Liberalisation) కాలంలో, గ్రామీణ మార్కెట్లలోకి మార్వాడి వ్యాపారులు క్రమంగా ప్రవేశించారు.పట్టణాలలో పెద్ద మోటారు వ్యాపారం చేసే వారు, మొదటగా పల్లె బజార్లలో గోదాములు ఏర్పాటు చేశారు.ప్రారంభంలో వైశ్యులకు తక్కువ వడ్డీ రుణం లేదా క్రెడిట్ లో సరుకులు ఇచ్చి స్నేహం పెంచుకున్నారు. కొన్నేళ్లలోనే స్వంత దుకాణాలు ప్రారంభించారు. మార్వాడి వ్యాపారులు సంఖ్యాపరంగా లాభం (Economies of scale) ఆధారంగా పనిచేశారు. పెద్ద మొత్తంలో సరుకులు తక్కువ ధరలకు కొనుగోలు, ఒకే బ్రాండ్‌ను పల్లె మొత్తం విక్రయించడం, కస్టమర్ ను ఆకర్షించే డిస్కౌంట్ ఆఫర్లు, ధర యుద్ధం ద్వారా స్థానిక వైశ్యుల లాభం తగ్గించడం. పలితంగా స్థానిక వైశ్యుల మార్కెట్ షేర్ తగ్గిపోవడం, పాత కస్టమర్లలో కొంతమంది తక్కువ ధరల కోసం మార్వాడులవైపు వెళ్లడం, పల్లెలో వైశ్యుల కౌలు దుకాణాలు మూసివేయబడటం, గ్రామంలో ఆర్థిక నిర్ణయాలు “బయటి వ్యక్తుల” చేతుల్లోకి వెళ్లడం చకచకా జరిగిపోయాయి.
చార్ట్ – వైశ్యుల వ్యాపారాల తగ్గుదల :
1995: ██████████████████████ (100%)
2005: ████████████ (65%)
2015: ██████ (35%)
2024: ███ (15%)
మూలధన లోటు –
ఒకప్పుడు గ్రామంలో వైశ్యుడే రైతుకు విత్తనం, ఎరువు, నిత్యావసరాలను సరఫరా చేసి, చెల్లింపులు పంట తర్వాతే తీసుకునేవాడు. కానీ వ్యాపారం తగ్గిపోవడంతో ఆయనకే రుణం అవసరమయ్యే పరిస్థితి వచ్చింది. బ్యాంకుల రుణాలపై కఠిన నిబంధనలు, భూమి పత్రాలపై ఆధారపడిన రుణ విధానం,మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ వల్ల స్థానిక వైశ్యులు అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకోలేకపోయారు.ఇదే సమయంలో, బాహ్య రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపార వర్గాలు (ప్రత్యేకించి మార్వాడీలు) పెద్ద మూలధనంతో, తక్కువ లాభ మార్జిన్‌తో వస్తువులను అమ్మడం మొదలుపెట్టారు.అనధికార రుణదాతల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకొని వ్యాపారం కొనసాగించేందుకు వైశ్యులు ప్రయత్నించగా, ఆ వడ్డీ భారం వారిని పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ఆ పోటీని తట్టుకోలేక క్రమంగా వ్యాపారం మూతబెట్టాల్సి వచ్చింది.
పల్లె ఆర్థిక వ్యవస్థపై ప్రభావం –
స్థానిక వ్యాపారి వెనక్కి తగ్గితే, గ్రామంలో నిధుల ప్రవాహం (సర్కులేషన్)బలహీనమవుతుంది. వైశ్యుడు సంపాదించిన లాభం మళ్లీ పల్లెలోనే తిరుగుతుంది, రైతు నుంచి కూలీ వరకు అందరికీ లాభం చేకూరుతుంది. కానీ మార్వాడీ వ్యాపారి సంపాదనను గ్రామం వెలుపలకి తరలిస్తాడు. దీని ఫలితంగా పల్లె ఆర్థిక చక్రం నెమ్మదించింది, స్థానిక ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి.రుణ భరోసా లేకపోవడం, వైశ్యులు లేకపోవడంతో రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి వచ్చింది, కానీ అక్కడ రుణాలు పొందడం కష్టం. చిన్న వ్యాపారాలు మూతపడటం, గ్రామీణ మార్కెట్‌లో మోనోపోలీ ఏర్పడి, ధరల నియంత్రణ కోల్పోయింది.
వ్యాపారం నుంచి సమాజం వరకు –
వైశ్యులు ఒకప్పుడు పల్లెల్లో ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దాతృత్వ పనుల్లో ముందుండేవారు.ఆర్థిక పతనం వారిని ఆ సామాజిక పాత్రల నుండి దూరం చేసింది.గ్రామ పండుగలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఆలయోత్సవాలు ఇవన్నీ వారి సహకారం లేకుండా నెమ్మదిగా మసకబారుతున్నాయి.వైశ్యుల ఆర్థిక బలం తగ్గిపోవడంతో పల్లె ఉత్సవాలు, దాన ధర్మాలు, దేవాలయ సహకారం తగ్గింది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు తగ్గాయి, ఎందుకంటే మార్వాడి వ్యాపారులు ఎక్కువగా బయటి కార్మికులను తీసుకున్నారు.
పల్లెలు బతుకాలంటే –
గ్రామీణ వైశ్యులు కేవలం వ్యాపారులు కాదు, వారు పల్లె ఆర్థిక శక్తి కేంద్రాలు, మార్వాడీల ఆధిపత్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆధునిక మార్కెట్ పోటీ , ఇవన్నీ కలిపి పల్లె వ్యాపారాన్ని కోలుకోనంతగా బలహీనపరిచాయి.ఈ పరిస్థితిని మార్చడం కోసం ప్రభుత్వం, గ్రామీణ సమాజం కలసి పని చేస్తేనే పాత ఉజ్వల దశ తిరిగి వస్తుంది. ఇందుకోసం ముందుగా ప్రభుత్వం చొరవ చూపాలీ, అందుకు అనుగుణంగా గ్రామీణ వైశ్య సహకార బ్యాంకులు, వైశ్యులు కలసి రుణాలివ్వగలిగే విధంగా సహకార బ్యాంకులు ప్రారంభించాలి. సబ్సిడీతో రుణ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వ్యాపారులకు ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలి. మార్కెట్ షేరింగ్ పాలసీ – గ్రామాల్లో పెద్ద రిటైల్ గొలుసు దుకాణాలపై పరిమితి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం – వైశ్య వ్యాపారులకు మాత్రమే ప్రత్యేక గ్రామీణ ఆన్‌లైన్ విక్రయ వేదిక. పన్ను రాయితీలు – చిన్న వ్యాపారాల GST పరిమితిని పెంచడం, వార్షిక పన్ను రాయితీలు. యువత భాగస్వామ్యం – వైశ్య యువతకు ఆధునిక మార్కెటింగ్, డిజిటల్ పేమెంట్స్ ట్రైనింగ్. స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం – స్థానిక పంటలు, హస్తకళలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ హామీ. వ్యాపార వారసత్వ హామీ – కుటుంబ వ్యాపారాల వారసత్వాన్ని కాపాడేందుకు చట్టపరమైన సాయం. వైశ్య సాంస్కృతిక ఉత్సవాలు – వ్యాపారుల సామాజిక గుర్తింపు పెంచే కార్యక్రమాలు. మార్వాడీ-వైశ్య భాగస్వామ్య నమూనా – పోటీ కాకుండా భాగస్వామ్యం ఏర్పరుచుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిందించినప్పుడే తెలంగాణకు మంచి ఆర్థిక భవిష్యత్తు ఉంటుందని ఆశిద్దాం .