డాక్టర్. కేశవులు భాషవత్తిని. ఎండి. సైకియాట్రీ. ఉస్మానియా., చైర్మన్ : తెలంగాణ ఇంటలెక్చువల్స్ అసోసియేషన్.
తెలంగాణ ఉద్యమం… అది కేవలం ఒక ఉద్యమం కాదు. అది లక్షలమంది ప్రజల కలల సంగ్రామం. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్, తెలంగాణ ప్రజల మనసులో దేవుడి స్థానంలో నిలిచాడు. ఉద్యమ గమనంలో అతని వెంట నడిచినవారిలో హరీష్ రావు అనేది ఒక పేరే కాదు… ఒక నమ్మకం. కవిత అనేది మహిళా ఉద్యమం రూపంగా భావించారు. కేటీఆర్ తెలివితేటలతో, ఆధునిక మేనేజ్‌మెంట్ శైలితో ఎదుగుతూ, తనను తాను వారసత్వానికి సిద్ధం చేసుకున్నాడు.
ఈ ముగ్గురు… ఒకే కుటుంబానికి చెందినవారు. కానీ ఇప్పుడు, ఒకే కుటుంబంలో పచ్చని యుద్ధం జరుగుతోంది. ఇది సగటు తెలంగాణ ప్రజల హృదయంలో పలు ప్రశ్నలను రేపుతోంది.
కవిత వైపు….
కవిత… ఉద్యమంలో ఆమె పాత్రను ఎవ్వరూ చిన్నచూపు చూడలేరు. ఉద్యమంలో గళమెత్తి మాట్లాడింది, మహిళలను కలుపుకుంది, తనదైన ధోరణిలో ముందుకెళ్లింది. కానీ, రాష్ట్ర ఏర్పాటయ్యాక ఆమెకు వచ్చిన మంచి అవకాశాలూ, చేజారిన అవకాశాలూ కూడ ఉన్నాయి. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒదిగి ఉండకుండా అధికార దర్పంతో అవినీతి కార్యకలాపాలకు పాల్పడి లిక్కర్ కేసులో జైలు పాలు కావడం ప్రజలను ఆశ్చర్య చేతులను చేసింది. ఒక మగవారసుడు ఉన్నప్పుడు — కుటుంబ రాజకీయాల్లో మహిళకు స్థానం లేకుండా పోతుందా అనే ఆలోచన ఆమెను గాయం చేసింది. కేసీఆర్ తన వారసత్వాన్ని కేటీఆర్‌కు అప్పగించాలనుకున్న ప్రతిసారీ, ఆమె హృదయంలో ఒక మలుపు తిరిగింది. “నేను కూడా ఈ ఉద్యమానికి పుట్టినదాన్ని కదా?” అనే వేదన ఆమెను హత్తుకుంది.
హరీష్ రావు వైపు..
హరీష్ రావు… ఉద్యమ యోధుడు. ఆయనలో బలం, ఆయనలో ప్రాచుర్యం ఉంది. ప్రజల్లో అతి ఎక్కువ బలమైన నమ్మకాన్ని పొందిన నాయకుడు. ఉద్యమం రోజుల్లో ప్రజల మధ్య తిరిగినవాడు. కేసీఆర్ తర్వాత నాయకత్వ బాధ్యతలు తీసుకోవాల్సింది తానే అని కొందరు భావించారు. కానీ కేసీఆర్ తన మనసులో కేటీఆర్‌కే వారసత్వాన్ని కేటాయించాలనుకున్నప్పటి నుంచే… హరీష్ మనసులో పగటి కలలు కరిగిపోయినట్టయ్యాయి. కానీ మనసులో మాత్రం కెసిఆర్ పార్టీ బాధ్యతలు అధికార బాధితులు ఉన్నంతవరకు పార్టీని వదిలేది లేదని దృఢ నిశ్చయంతో ఉన్నారు, ఎప్పుడైతే కేసీఆర్ పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటారో ఆ క్షణం నుంచే విడిపోవాలని , దూరం కావాలనే ఆలోచన ఉన్నది మాత్రం ఖాయం. మామ ఉన్నంత కాలం మామకు అన్యాయం చేయవద్దని మంచి గుణం హరీష్ రావు లో ఉన్నది. అందుకే , అతను కుటుంబానికి విశ్వాసంగా ఉండాలని, కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్నాడు.
కేటీఆర్ వైపు…
కేటీఆర్… తండ్రి వారసత్వాన్ని భుజాన వేసుకుని ముందుకెళ్లాలనుకుంటున్నాడు. తనలో ఆధునికత ఉంది. కొత్త తరానికి దగ్గరవ్వగలగడం తెలుసు. కానీ అతనికి తెలిసిన పెద్ద సత్యం… తన కుటుంబంలోనే తనకు వ్యతిరేక శబ్దాలు వినిపిస్తున్నాయని. ఒకవైపు చెల్లెలు, మరోవైపు మేన బావ… ఎవరికీ లోలోపల సంతృప్తి లేదు. ఇది కేటీఆర్‌కు మానసికంగా భారంగా మారుతోంది. తన తండ్రి స్థానం పొందాలంటే — కుటుంబాన్ని రెండుగా చీల్చుకోవాలా? అని అంతరాంతరంగా తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. అటు హరీష్ రావు నుంచి ఇటు కవిత నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందనే విషయం కేటీఆర్ కు తెలియంది ఏమీ కాదు, గతంలో చాలా సందర్భాల్లో అటు మేనభావను, సొంత చెల్లెను కూడా దూరంగా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా తండ్రి వారసునిగా తనకే అన్ని హక్కులు ఉన్నాయని కేటీఆర్ బలంగా నమ్ముతున్నారు. కేటీఆర్ కు కొత్త తరం నాయకులు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజలలో హరీష్ రావుకు ఉన్నంత ప్రజాబలం లేదన్నది కొందరి అభిప్రాయం .
కేసీఆర్ స్థితి….
కేసీఆర్… ఇప్పుడు ఒక తండ్రి మాత్రమే కాదు, ఒక పార్టీ అధినేత కూడా. కానీ తండ్రి మనసు ఒకవైపు, రాజకీయ అవసరాలు మరోవైపు. తన కొడుకు ఎదగాలనుకుంటున్నాడు, తన మేనల్లుడు తన సానుభూతిని కోల్పోకూడదనుకుంటున్నాడు, తన కుమార్తె గాయపడకూడదనుకుంటున్నాడు. ఎవరు ఏ రకంగా మేనేజ్ చేయాలో చేస్తున్నాడు , కానీ ఎవరి మనసూ తృప్తి పడని ఈ పరిస్థితి… పార్టీకి పెద్ద ప్రమాదాన్ని తెస్తోంది.
ఈ యుద్ధం ఎక్కడికి ?
ఈ పోరు పొలిటికల్ వారసత్వ యుద్ధంగా మొదలయింది. కానీ ఇప్పుడు ఆత్మగౌరవ పోరాటంగా మారుతోంది. ఈ గొడవను బయటపెట్టకపోయినా… లోపల పగులు వస్తున్నాయి. ఆ పగుళ్లను కాపాడుకోలేకపోతే — కేసీఆర్ పార్టీ రెండు భాగాలవ్వడం గానీ, కొత్త పార్టీలు పుట్టుకనే గానీ, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోవడం గానీ తప్పదు.
అవసానం..
ఈ కథలో ఎవరు దోషులు కాదు. ఎవరి ఆశయాలు తప్పు కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఒక పోరాటం ఉంది. ఒక్క తండ్రి మనసు, ఒక్క కుటుంబ గౌరవం, ఒక ఉద్యమ పునాదుల మీద వారసత్వ రాజకీయాల కలిసిన క్లిష్ట సమరం ఇది. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు… ఎవరికి గెలుపో కాదు…ఓటమి కాదు, తెలంగాణ ఉద్యమ ఆత్మను ఎవరు కాపాడతారో అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బి ఆర్ ఎస్ మనగడ ఎలా ఉంటుందనేది కూడ ప్రశ్నార్ధకమే.