టీ టైమ్స్ ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్.
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొనసాగుతున్న వరద బీభత్స పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి. కేశవులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖలో రాసారు.
ఆ లేఖలో డాక్టర్ కేశవులు…
“వరదలతో రైతులు, కార్మికులు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని ఆహారం, తాగునీరు, ఔషధాల కొరతతో బాధపడుతున్నారు. పంటలు ముంపుకు గురై రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గృహాలు కూలిపోవడంతో నిరుపేద కుటుంబాలు గగనతలమైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఆర్థిక సాయం ప్రకటించి, సహాయక చర్యలను విస్తృతంగా చేపట్టాలి” అని అభ్యర్థించారు.
డాక్టర్ కేశవులు గారి విన్నపంలో ముఖ్యాంశాలు:
- వరద బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం (ఎక్స్‌గ్రేషియా) ప్రకటించాలి.
- పంటలు ముంపుకు గురైన రైతులకు ప్రత్యేక పంట పరిహారం అందించాలి.
- ఇళ్లు కోల్పోయిన వారికి ఉచిత గృహ నిర్మాణ సహాయం ఇవ్వాలి.
- వరదలతో ఇరుక్కుపోయిన వారికి రేషన్ సామగ్రి, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలి.
- పశువులు మృతి చెందిన రైతులకు తగిన పశుసంపద పరిహారం ఇవ్వాలి.
- నష్టపోయిన రహదారులు, విద్యుత్, తాగునీటి వ్యవస్థలను అత్యవసర పునరుద్ధరణ చేయాలి.
డాక్టర్ కేశవులు గారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ –
“ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడం ప్రభుత్వ అత్యున్నత కర్తవ్యం. వరద బాధితులకు వెంటనే ఆర్థిక సాయం అందించి వారి జీవనోపాధి పునరుద్ధరించాలి. తెలంగాణ మేధావుల సంఘం తరఫున మేము ప్రజల పక్షాన నిలబడి సహాయార్థం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు.
– డాక్టర్ బి. కేశవులు
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం