Friday, August 29, 2025

తెలంగాణలో….బీసీలను మోసం చేస్తున్నది. ఏ పార్టీ…? డా. కేశవులు హాట్ కామెంట్స్.

డా. కేశవులు భాషవత్తిని. ఎండి. సైకియాట్రీ.
చైర్మన్ : తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం, బీసీల ఆశలు విరివిగా పెరిగాయి. కొత్త రాష్ట్రంలో తాము న్యాయమైన ప్రాతినిధ్యం పొందుతామనే నమ్మకంతో, తెలంగాణ ఉద్యమంలో బీసీలు ముందుండి పోరాటం చేసి ప్రాణాలు సైతం వదిలారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత కూడా బీసీలకు రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాలలో గణనీయమైన ప్రగతి కనిపించడం లేదు. దీనితో, ఒక ప్రాథమిక ప్రశ్న వెలువడుతోంది – “తెలంగాణలో బీసీలను మోసం చేస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటిగా ఉండదు. దీనిని అనేక కోణాల నుంచి చూడాలి – రాజకీయ పార్టీలు, నాయకులు, పాలకులు, బీసీల మధ్య విభజనలు, కుల ఆధారిత రాజకీయాలు, తదితర అంశాల ఆధారంగా. ఈ వ్యాసం ద్వారా అన్ని కోణాలను విశ్లేషించి, ఎవరెవరు బీసీలను ఎలా మోసం చేస్తున్నారో లోతుగా అర్థం చేసుకుందాం.

తెలంగాణలో బీసీలు…

తెలంగాణలో బీసీ జనాభా సుమారు 56% కు పైగా ఉన్నట్టు సర్వేలు సూచిస్తున్నాయి. కానీ,అసెంబ్లీలో బీసీలకు ప్రాతినిధ్యం 20% కన్నా తక్కువ, మంత్రివర్గంలో బీసీలకు గల స్థానం 5% – 10% ,నామినేటెడ్ పదవుల్లో బీసీలకు లభించే అవకాశం చాలా తక్కువ, ఇది చూస్తేనే స్పష్టమవుతోంది – బీసీలు సంఖ్యలో పెద్దవారు అయినా అధికారంలో చిన్నవారు….ఆర్థికంగా బీసీల వెనుకబాటుతనం – ప్రభుత్వ ధ్యాస లోపం, బీసీ కార్మికులకు ఉపాధి కల్పించే రంగాలకు బదులు, ఆర్థిక సహాయ పథకాలు నిర్లక్ష్యం,రాజకీయం మాత్రమే కాకుండా ఆర్థిక రంగంలో కూడా బీసీలు దుర్వినియోగానికి గురవుతున్నారు.బీసీ సంక్షేమ కోసం నిధుల కేటాయింపు 2024 బడ్జెట్‌లో: రూ. 5,000 కోట్లు. ఇందులో కూడా 60% విడుదల కాకుండా మిగిలిపోవడం గమనార్హం.బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఉద్యోగ హామీలు, బీసీ కార్పొరేషన్ రుణాలు – పేరుకే ఉన్నవి, అమలు లేనివి.

బి ఆర్ ఎస్ – మాటలతో మాయ …

తెలంగాణ రాష్ట్రంలో BRS అధినేత కె. చంద్రశేఖర్ రావు చాలా సార్లు బీసీలకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, బీసీ కమిషన్ ఏర్పాటుచేశారని ప్రకటించారు. కానీ దానికి చట్టబద్ధ హోదా లేదు.బీసీ కుల గణన వేశామని చెప్పారు. కానీ అది ప్రజలకు వెల్లడించలేదు.బీసీలకు రాజకీయం లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కానీ చేయలేదు. కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ 2014, 2018లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది.కానీ మంత్రివర్గంలో కేవలం ఒకరిని మాత్రమే చేర్చారు. బీసీలకు ఇచ్చిన టికెట్లు 15-18% లోపే ఉన్నాయి. బీసీ బందు, బీసీ గీతా కార్మికులకు ఉచిత యంత్రాలు వంటి మాటలు ఇచ్చారు. కానీ అది మైనార్టీ లబ్దిదారులకు మాత్రమే వర్తించింది. బీసీలకు ఒక్క హామీ నెరవేర్చకుండా BRS వాడుకుంది. బీసీ నేతలను నామినేటెడ్ పదవుల్లో పెట్టకుండా, కులానుగుణంగా బేధాలు చూపించారు. రాజకీయంగా బీసీలకు టికెట్లు ఇవ్వకుండా, వారి సామర్థ్యాన్ని అణిచేశారు.వాస్తవం ఏమిటంటే బి ఆర్ ఎస్ నాయకత్వం మాటలు గొప్పగా చెప్పినా, కార్యాచరణ శూన్యం. పాలనలో బీసీలు నియమించబడిన నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరగలేదు.

కాంగ్రెస్ పార్టీ ….

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రత్యేకంగా హామీలు ఇచ్చి చేతనలో ఇవ్వడం మానేసింది.కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉన్న బీసీలకు పదవుల్లో సముచిత స్థానం ఇవ్వడం లేదు.గత ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన టికెట్లు చాలా తక్కువ. ఇక కాంగ్రెస్ బీసీలను ఓటర్లుగా చూసినా, నాయకత్వం ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంది. 2023లో 119 సీట్లలో కేవలం 18 బీసీ అభ్యర్థులను నిలబెట్టారు. పార్టీ అత్యున్నత పదవులు, ముఖ్య మైన నాయకత్వ స్థానాల్లో బీసీలు చాలా తక్కువ. అసెంబ్లీ సగటున 20% కన్నా తక్కువ, మంత్రివర్గం లో ఇద్దరికీ మించి లేదు.ప్రభుత్వ సంస్థల చైర్మన్ పదవులు 10% కన్నా తక్కువ, కార్పొరేషన్ నామినేషన్లు 15% లోపు మాత్రమే, అంటే, కాంగ్రెస్ పార్టీ బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తోంది.కార్పోరేషన్లు, బోర్డులు, యూనివర్శిటీల పాలక మండళ్లలో బీసీ ప్రతినిధులు తక్కువ, వక్ర రాజకీయం వల్ల సామర్థ్యం ఉన్న బీసీ నేతలు వంచితులవుతున్నారు.

బీజేపీ …

బీజేపీ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నా, బీసీలను ఆకర్షించేందుకు, బీసీ మోర్చా పేరుతో కార్యక్రమాలు చేస్తోంది, కొందరి బీసీ నాయకులను ప్రాజెక్ట్ చేస్తోంది. కానీ ముఖ్య స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. అయితే – కేంద్రంలో గల బీజేపీ ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత కలిగే చట్టాలు చేయడం లేదు. తెలంగాణ బీజేపీలో బీసీకి ప్రెసిడెంట్ పదవి ఇవ్వలేదు. బీజేపీ ఊహాజనిత వాగ్దానాలు, కార్యరూపం లేని కార్యక్రమాలు,కుల ప్రాతినిధ్యం గల బీసీ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమూహ ప్రయోజనాలను త్యాగం చేయడం చూస్తున్నాం. ఇతర పార్టీల లాగే బీజేపీ కూడా బీసీలను వినియోగించుకునే ప్రయత్నం మాత్రమే చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి.ఈ రకంగా మూడు పార్టీలూ బీసీలను ఓటింగ్ యంత్రాలుగా మాత్రమే చూస్తున్నాయి.

బీసీ సంఘాలు –

ఈ మధ్యకాలంలో ఏర్పడిన ఇండియా బ్లాక్, బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘాల వంటి సంస్థలు, బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాయని చెబుతున్నా…అవి స్పష్టమైన కార్యాచరణ లేకుండా తిరుగుతున్నాయి. బీసీ ఉద్యమాల పేరుతో పేరుకు నాయకత్వం, కార్యానికి మూకామూకీ నడక మాత్రమే ఉంది. బీసీల క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టడం కంటే, ఓట్ల రాజకీయం పై దృష్టి పెడుతున్నారు, బీసీలు అనేక కులాలను కలిగి ఉండటం కూడా బీసీల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. బీసీలు, మధ్యస్త బీసీలు, ఎంబీసీలు గా చలామణి అవుతున్నారు.ఈ విభజనలను రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. బీసీలకు ఏకం చేసే నేతలు లేకపోవడం, ఒకే సంఘాటిత శక్తిగా ఎదుగలేకపోవడం వల్ల వారు మోసపోతున్నారు.BRS మాటల మాయ, హామీల అమలులో మోసం, కాంగ్రెస్ పార్టీ పై నమ్మక పెరగకపోవడం, బీసీ నేతలకు ప్రాధాన్యత లేకపోవడం, మీడియా బీసీల సమస్యల పట్ల పట్టించుకోకపోవడంలాంటి విషయాల్లో బీసీల కుల సంఘాల నాయకులు సంఘటితంగా పోరాటం చేయలేకపోవడం బీసీల బలహీనతకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

నిజాయితీగా –

అన్ని బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకురావడం అత్యవసరం. ఒక్క బీసీ లీడర్ – బీసీలకు తాము నమ్మే నాయకత్వం అవసరం. ప్రాంత, కుల, పార్టీ ఆధారాలు లేకుండా వారి హక్కుల కోసం పోరాడే నేత ఉండాలి. తెలంగాణలో బీసీలను మోసం చేస్తున్నవి అధికారపార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, బీసీలను ముక్కలుగా విడగొట్టి వాడుకునే రాజకీయ వ్యవస్థ,మరియు… కొంతమంది బీసీ నేతలే,,,. బీసీలు ఓటర్‌గానే కాకుండా నాయకులుగా ఎదగాలంటే, ఇప్పుడు మేలుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు రిజర్వేషన్లపై నిఘా అవసరం. ఒక్క బీసీ నాయకుడికి పదవి రావడం కంటే, లక్షల మంది బీసీలకు న్యాయం జరిగే విధంగా నడపగల సామూహిక శక్తి అవసరం. లేదంటే, “బీసీలను మోసం చేస్తున్నది ఎవరు?” అనే ప్రశ్నకు “మేమే!” అనే సమాధానం రేపు మన బీసీ సమాజం నుండి రావాల్సి వస్తుంది సుమా!

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img