ఉత్తర తెలంగాణకు మంచి రోజులు ఎప్పుడు ?
ప్రాంతీయ అసమానతలు, అస్తిత్వ వాంఛల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రాంతీయ వివక్ష కొనసాగుతోందనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి పాలక వర్గాలు కనీస శ్రద్ధ చూపడం లేదనే వాదన బలపడుతోంది. ఉత్తర తెలంగాణ ప్రాంతం పై వివక్ష రకరకాలుగా కోనసాగుతోందని, ముఖ్యమంత్రులు , కొందరు మంత్రులు ప్రాతినిధ్యం వహించే మూడు – నాలుగు జిల్లాల క్లష్టర్లో జరిగే అభివృద్ధి ఇతర జిల్లాల్లో జరగటం లేదని, దక్షిణ తెలంగాణ జిల్లాల మీదున్న ప్రత్యేక అభిమానం శ్రద్ధ, అభివృద్ధి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై లేదని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటే పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుంది. రహదారులు, రైలు, విమాన మార్గాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయి.పరిశ్రమల ఏర్పాటు, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉత్తర తెలంగాణలో నేటికీ నేడు గ్రామీణ రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నేటికి వందలాది గ్రామాలు, గిరిజన తండాలు, గోండు గూడేలకు సరైన దారుల్లేవు. అక్కడ వాగులు వంకలు దాటేందుకు చాలా చోట్ల కల్వర్టులు కూడా లేవు. జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్లడానికీ అవస్థలు పడుతున్నారు. రైల్వే లైన్ల అభివృద్ధిలోనూ, విమానయానంలోనూ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నేడు 50 శాతం ప్రజల చేతిలో సెంటు భూమికూడా లేదు. భూ పంపిణీ పథకం కింద లక్షల్లో భూములు పంచినట్లు ప్రభుత్వ నివేదికల్లో ఉన్నా మెజార్టీ భూములు బినామీ పేర్లతో నాయకుల చేతుల్లోకి వెళ్లి పోయింది. స్థానికంగా ఉపాధి కల్పన కోసం చేపట్టాల్సిన చిన్న తరహా, కుటీర పరిశ్రమలూ పెద్దగా లేవు. ఫలితంగా నేడు ప్రాంతీయ, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి.
సుదర్శన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఇంకెప్పుడు ?
అన్నింటికీ మించి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోను ఉత్తర తెలంగాణ నుంచీ కేవలం ఇద్దరికి మాత్రమే బెర్తులు లభించడం మనకి తెలిసిందే. అనాదిగా నిర్లక్ష్యానికి గురవుతున్న భారీ విస్తీర్ణం గల అదిలాబాద్ నుంచి వివేక్ / వినోద్ లలో ఒకరికీ లేదా మరియు ఎం ఎల్ ఎ ప్రేమ్ సాగర్ రావుకు మొదటి విడుతలో మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడాన్ని ఆ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోను సీనియర్ కాంగ్రెస్ నేతగా పార్టీ కి పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన రెడ్డికి సైతం మొండి చెయ్యి ఆడిస్తూనే ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండు మంత్రిపదవులు ఉన్నప్పటికీ, పార్టీకీ అత్యంత కీలకమైన నాయకుడైన శ్రీధర్ బాబుకి కనీసం ఉప ముఖ్యమంత్రి పదవీ ఇవ్వలేకపోవడాన్ని అవమానకరంగా ఫీల్ అవుతున్నారు.. శ్రీధర్ బాబు లాంటి వాళ్లకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనని ఉత్తర తెలంగాణ వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.అటూ అభివృద్ధి విస్తరణలోను,ఇటూ మంత్రివర్గ విస్తరణలోను ఉత్తర తెలంగాణకు న్యాయం చేయలేకపోవడాన్ని సాక్షాత్తు కాంగ్రెస్ వాదులే నామోషిగా ఫీల్ అవుతున్నారు.
ప్రాంతీయ అభివృద్ది బోర్డు….
నగరాల్లో నివసిస్తున్న ప్రజలు ఏ అభివృద్ధి ఫలాలు, సౌకర్యాలను పొందుతున్నారో.. అదిలాబాద్ అడవుల్లోని ఓ మారుమూల గిరిజన గ్రామంలో, కరీంనగర్ జిల్లాలోని కాటారం చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు సైతం అలాంటి సౌకర్యాలు పొందినరోజే సమగ్రాభివృద్ధి సాధించినట్లు…తమ ఆశలు ఆకాంక్షాలు నెరవేస్తారని నమ్మకంతో కేసిఆర్ ప్రభుత్వాన్ని కాదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కావున సామాజిక, సంక్షేమము, సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంతో ముందుకు సాగాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రాంతీయ మనోభావాలను మన్నించి, వివక్ష-అంతరాలు లేకుండా, అభివృద్ధి సమవర్తిగా వ్యవహరించడం పాలక-విపక్షాల బాధ్యత అని గుర్తించాలి. అందుకు అనుగుణంగా చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ అభివృద్ది బోర్డు ఏర్పర్చాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాం.
ఫౌండర్ & చైర్మన్ :
నార్త్ - తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం.