ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లోని 258 నదులపై స్విస్ ఆర్గనైజేషన్ ప్రపంచ నదులలో ఔషధ కాలుష్యంపై అధ్యయనం చేసింది. అత్యంత కాలుష్యంగా మారిన నదులపై 2022లో ఈ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు మూసీ నది 22వ స్థానంలో ఉన్నట్లు ది ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ప్రచురితం అయ్యాయి. ఈ అధ్యయనాల ప్రకారం కనీసం 70 కిలోమీటర్ల మేర 48 రకాల రసాయన అవశేషాలు లభించాయి. మూసీనదిలో క్యాన్సర్ కారకాలైన ఆర్సెనిక్, క్రోమియం, కాపర్, నికిల్, లెడ్ తదితర భార లోహాలున్నట్లు ఎన్‌జీఆర్‌ఐ తన పరిశీలనలో గుర్తించింది. ఈ కలుషితమైన నీరు ప్రజల ఆరోగ్యానికి భారీగా హాని చేస్తోందనీ ముఖ్యంగా వివిధ రకాలైన క్యాన్సర్ లు, మూత్రపిండాల వ్యాధులు, చర్మ వ్యాధులు, అబార్షన్లు, కీళ్ళ నొప్పులు, కడుపు నొప్పి, గొంతు నొప్పి తదితర రోగాల భారిన పడతారని, వ్యవసాయ భూములు పంటలకు పనికి రాకుండా పోతాయనీ. చెరువుల్లో చేపలు, గడ్డిమేసే పశువులు, నీళ్లు తాగే పక్షులు సైతం పునరుత్పత్తి శక్తిని కోల్పోయే ప్రమాదముందని పరిశోధనలు తేల్చాయి.
ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్ పై నిర్లక్ష్యం ఎందుకు ?
నల్గొండ ఫ్లోరైడ్ కష్టం చెప్పుకుంటే తీరేది కాదు.. ఇక్కడ భూగర్భ జలాలను కాకుండా,ఉపరితల జలాలను మాత్రమే శుద్ధి చేసి వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర జలశక్తి సంస్థ చెప్పింది. కానీ గతంలో పాలించిన కాంగ్రెస్. టిడిపి బి ఆర్ ఎస్ తో సహా అన్ని పార్టీలు దాన్ని అమలు చేయలేదు. వాస్తవానికి వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నదులను శుభ్రం చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైనట్లే, టి ఆర్ ఎస్ ప్రభుత్వం కూడ నల్గొండ సమస్య పరిష్కారానికి ఏ మాత్రం చొరవ చూపలేదు. మూసి నది కాలుష్యం ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ మధ్యనే వచ్చిన నదులనీటి నాణ్యతా ఇండెక్స్ లో మూసీ రివర్ నీటిలో ఆక్సీజన్ స్థాయిలను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయిలు 1- 4 మధ్యన ఉండాల్సిన స్థానే, ఇది దామరచర్ల దగ్గర 15గా, వలిగొండ దగ్గర 13గా, వాడపల్లి దగ్గర 13గా ఉంది. బీఓడీ (బయోలాజికల్ ఆక్సీజన్ డిమాండ్) స్థాయిలు 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉండాలి.. కానీ వలిగొండ దగ్గర 10.01 శాతం ఉంది. డయేరియా, జ్వరం, చర్మవ్యాధులకు కారణమయ్యే భయంకరమైన కొలిఫాం బ్యాక్టీరియా తాగునీటిలో అసలే ఉండకూడదు. కానీ, దామరచర్లలో 1400గాను, వలిగొండ ప్రాంతంలో 2200 గాను, వాడపల్లి దగ్గర 1500గాను ఉంది. మూసీ నీటితో సాగు చేసే పంటలు, కూరగాయలను మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ వాసులు దశాబ్దాలుగా వాడుతున్నారు.
కాలుష్యానికి అసలు కారణం…
నిత్యం వందలాది పరిశ్రమలు, ఔషధ కంపెనీలు తమ వ్యర్థాలను నదిలోకి వదులుతున్నాయి. కాటేదాన్, పటాన్‌చెరు, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సనత్‌నగర్, ఆజామాబాద్,ఉప్పల్, మల్లాపూర్, నాచారం ఇండ్రస్ట్రియల్ ఏరియాల నుండి విష రసాయనాలు నేరుగా మూసీలో వదలేయడ అతి ప్రధాన సమస్యగా మారింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఇళ్ల నుండి వచ్చే డ్రైనేజీ నీళ్లు, వ్యర్థ పథార్థాలన్నీ ఇప్పుడు మూసీలోనే కలుస్తున్నాయి. ఈ విషపు నీళ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా కృష్ణాలో కలుస్తూ విషాన్ని పంచుతున్నాము. హైదరాబాద్‌లో నిత్యం 2000 ఎం ఎల్ డీల వరకు మురుగు, రసాయనాలతో కూడిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తున్నాయి. ఇందులో కేవలం 800 ఎం ఎల్ డీల నీటినే ఎస్ టీ పీల ద్వారా శుద్ది చేస్తున్నారు. మిగతాది శుద్ది లేకుండానే మూసీకి వదులుతున్నారు. ఫలితంగా మూసి డంపింగ్ యార్డుగా మారిపోతోంది . రెండేళ్ల కిందట మూసీలోకి 350 మిలియన్ లీటర్ల కాలుష్యం మాత్రమే వెళ్ళగా ఇప్పుడది 1,625 మిలియన్ లీటర్లకు పెరిగింది. మూసీ అంటే.. ఒక్కప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు జీవనాడి. కానీ ఇప్పుడు మూసీ అంటే ఓ కాలకూట విషం అన్న అభిప్రాయం నేడు ప్రబలంగా ఉంది.
సర్వం కోల్పోయే వాళ్ళకు ఇచ్చాకే….
మూసీ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభమవాలంటే ముందుగా మూసీ వెంట వివిధ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని అక్రమణలన్నీ తొలగించాలనీ మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌ఎ్‌ఫడీసీఎల్) నిర్ణయించింది . ఇందుకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ, సర్వే, ఎంఆర్‌డీసీఎల్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తూర్పున కొర్రెముల వద్ద ఉన్న ఔటర్ వరకు సర్వేను పూర్తి చేశారు. నార్సింగ్ నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో 12 వేలకు పైగా అక్రమణలు ఉన్నట్లు గుర్తించింది.ఇందులో హైదరాబాద్ జిల్లాలోని ఆసి్‌ఫనగర్, అంబర్‌పేట, బహదూర్‌పురా, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, నాంపల్లి, సైదాబాద్‌ల పరిధిలో పెద్దఎత్తున అక్రమణలు ఉన్నట్లుగా తేల్చారు. బహదూర్‌పురా, సైదాబాద్, అంబర్‌పేట మండలాల పరిధిలో అధికంగా నిర్మాణాలు ఉన్నాయి. చాలా వరకు 30, 40, 60 గజాల్లోనే పెద ప్రజలు ఇళ్లు కట్టుకున్నారు. మధ్యలో 10 అడుగుల దారి కూడా లేకుండానే నిర్మించుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల పరిధి రామంతాపూర్, భగాయత్ తదితర ప్రాంతాల్లో ఏకంగా కాలనీలే వచ్చేశాయి. కొందరు గోదాములు, షెడ్‌లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సర్వం కోల్పోయిన కుటుంబాలకు ఉచిత వసతి గృహాలు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి వాళ్లను సంతృప్తి పరిచిన తర్వాతనే మూసి నది ప్రక్షాళన అభివృద్ధి చేపట్టాలి లేకపోతే అమాయకులకు అన్యాయం చేసిన వారీగా చరిత్రలో నిలిచి పోయే అపవాదు ఉంటుందని ప్రభుత్వంలోని పెద్దలు గ్రహించాలి.
బి ఆర్ ఎస్ పార్టీ ఎందుకిలా ?
మూసి నది ప్రక్షాళన అభివృద్ధిని వ్యతిరేకించే వాళ్ళు ఒక్కసారి…మూసి పరివాహిక ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్ల జీవితాలను గూర్చి మనసుతో ఆలోచించండి. వాళ్లను అలానే మురికీ కూపం లోనే వదిలేసి, మనం మాత్రం ఏ సి బంగ్లాలో నివసిస్తూ, రాజకీయ పబ్బం గడపడటం ఎంతవరకు సమంజసమో కేటీఆర్, హరీష్ రావులు మానవతా కోణంలో ఆలోచించాలి. అధికారపార్టీ పై పగ ప్రతీకారం కోసం అమాయక ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకూ సమంజసమో బి ఆర్ ఎస్ పార్టీ నేతలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా మూసి నదినీ ప్రక్షాళన అభివృద్ధి చేయకుండా ఇలానే వదిలేస్తే… రాబోయే రోజుల్లో మరింత తీవ్రమై ఉమ్మడి నల్గొండ , హైదరాబాద్ జిల్లా ప్రజల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది.మూసి అభివృద్ధి ఫోరం పేరుతో గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు జపాన్ వద్ద రూ.1000 కోట్లు తీసుకువచ్చి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా నేడు రాజకీయ పబ్బం కోసం మూసీ పరివాహక ప్రాంత గృహ నిర్మాణదారులకు అండగా ఉంటామని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆనాడు సాక్షాత్తు నాటి సీఎం కేసిఆర్ మూసి నది ప్రక్షాళన కు అందరూ సహకరించాలని మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతున్నాయి. కాబట్టి మూసి నది ప్రక్షాళన అభివృద్ధికి ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుపడవద్దని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని తెలంగాణ సమాజం బి ఆర్ ఎస్ పార్టీ అధినేతలను ప్రార్థించుతున్నది.
డాక్టర్. బి. కేశవులు . ఎండి. సైకియాట్రీ.
చైర్మన్ : తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659.