ఉద్యమ కారులకి పుట్టినిల్లు లాంటి భువనగిరి గడ్డ మరో గొప్ప నాయకున్ని కోల్పోయింది రాజకీయాలంటే కేవలం ఓట్ల ద్వారా గెలవడం మాత్రమేనా అన్న నానుడిని పటాపంచలు చేస్తూ ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతలు భువనగిరి ప్రాంతంలో మనకు ఎక్కువ కనిపిస్తుంటారు.బెల్లి లలిత,సామబశివుడు లాంటి నేతలు అందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఓట్ల రాజకీయాలే నేతల గుర్తింపుకు కొలమానం అంటే ఈ దేశ ప్రధానమంత్రి ప్రముఖ జాతీయ నాయకుడు ఐన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రావి నారాయణరెడ్డి గారిని కీర్తికి ఏ కిరీటం పెట్టగలం.మహానేత తెలంగాణ సాయుధ పోరాట రథసారథి రావి నారాయణరెడ్డి గారి వర్ధంతి ఒక్క రోజు ముందే జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి మృతి చెందడం యాదృచ్ఛికమైన నారాయణరెడ్డి సేవస్ఫూర్తిని కొనసాగించిన నేత బాలకృష్ణారెడ్డి.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బడుగు జీవుల ఏకీకరణకు రావి నారాయణరెడ్డి ఎంతటి కృషి చేశాడో అదేపరంపరలో అదే ఉద్యమస్ఫూర్తితో జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అంతటి ఉన్నతమైన కృషిని సల్పాడు .ఒకనాడు ఆంధ్ర మహాసభకు వేదికైన భువనగిరిలో మలిదశ తెలంగాణ ఉద్యమానికి కూడా భువనగిరి కేంద్రం కావడం, అనంతరం టిఆర్ఎస్ ఆవిర్భావంతో గొప్ప ఉద్యమ ప్రాంతంగా భువనగిరి టిఆర్ఎస్ ను కూడా అంతగానే ఆదరించింది.
ప్రజల ఆదరణ తో టిఆర్ ఎస్
లో అగ్ర నేత గ ఎదిగినవాడు బాలకృష్ణ రెడ్డి .తెరాస అంటేనే అంటే నే అంటీ ముట్టనట్టుగా ఉన్న నాటి అవకాశవాద రాజకీయ పార్టీల నేతలు ఏ ఒక్కరు కూడా టిఆర్ఎస్ జండా పట్టలేదు .అప్పటికే సామాజిక రంగంలో అనేక సేవా కార్యక్రమాల ద్వారా యువజన నాయకుడిగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి బాలకృష్ణ రెడ్డి.నాడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కు సమీపాన జలదృశ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో భువనగిరి కిల సాక్షిగా ఖిలా దృశ్యంగా మార్చిన ఘనత బాలకృష్ణారెడ్డికే తగ్గుతుంది.
బాలకృష్ణ రెడ్డి ప్రభావం భువనగిరికే పరిమితం కాకుండా నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా బాలకృష్ణ రెడ్డి ప్రభ దేదీప్యమానంగా వెలిగింది.ఫ్లోరైడ్ భూతం కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న భువనగిరి ప్రాంతం అంటే అష్ట వంకర్లు తిరిగిన కాళ్లు చేతులతో ప్రతి గ్రామం ఫ్లోరైడ్ బాధితులతో దర్శనం ఇచ్చేది.ప్రభుత్వాలు గూడ చేయలేని పనిని జిట్టా బుజాలకెత్తుకున్నాడు.ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన ప్యూరిఫై ఆర్ఓ నీటిని గ్రామ సీమలకు పరిచయం చేసిన అభినవ భగీరధుడు బాలకృష్ణారెడ్డి.భువనగిరి ప్రాంతంలో జిట్టా సహకారం అందని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.స్వయంగా తాను స్వామి వివేకానందుని ప్రభావంతో సామాజిక సేవా రంగంలోకి రావడంతో అదే స్ఫూర్తిని యువతకు అందజేయడంలో ఎనలేని కృషి చేశాడు.ప్రజలకు ఏదో చేయాలన్న తలంపు తో తాను ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలని కలగన్నాడే తప్పితే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే తనకు కొత్తగా వచ్చేది తెచ్చేది ఏమీ లేదన్న సంగతి తెలిసినవాడు బాలకృష్ణ రెడ్డి.పుట్టిన గడ్డకు రుణము తీర్చుకున్న బాలకృష్ణారెడ్డికి ఈ ప్రాంతం మాత్రం రుణం ఉందిఎప్పటికీ ఈ ప్రాంతం బాలకృష్ణారెడ్డికి రుణగ్రస్తుంగానే ఉంటుంది.
టిఆర్ఎస్ ఆవిర్భావంలో ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి టీఆర్ఎస్ నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేశాడు .తాను కష్టపడి పోగు చేసుకున్నదంత రాజకీయాల కోసమే ఖర్చు చేశాడు .అడిగిన వారికి సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న బాలకృష్ణారెడ్డి అపర దాన కర్ణుడు అని చెప్పాలి .తనకున్న పరిచయాలను ఈ ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించి ఎంతో అభివృద్ధి చేశాడు .భువనగిరి జూనియర్ కాలేజీ ని యూనివర్సిటీ స్థాయిలో నిర్మాణం చేసిన ఘనత బాలకృష్ణ రెడ్డి కే దక్కుతుంది.
తెలంగాణ ఉద్యమ నిర్మాణం కావాలంటే సాంస్కృతికంగా బలమైన నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ అస్తిత్వాన్ని తట్టి లేపడం ద్వారా మాత్రమే తెలంగాణ ఉద్యమానికి గట్టి పునాదులు పడతాయని బాలకృష్ణ రెడ్డి గట్టిగా నమ్మేవారు.అందులో భాగంగానే ఎంతోమంది కవులను కళాకారులను ఆదరించాడు అక్కున చేర్చుకున్నాడు వాళ్ళ అవసరాలు తీర్చాడు సాంస్కృతిక ఉద్యమంలో ముందడుగులో భాగంగా తెలంగాణ సంభూరాళ్ళ పేరుతో నిజాం కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమం విజయవంతం అయ్యింది.తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే నాటి కార్యక్రమం గొప్ప మైలురాయిగా చెప్పవచ్చు ..
ఉద్దండ కవులను కళాకారులను రచయితలను ఉద్యమకారులను రాజకీయవేత్తలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ సంభూరాల దాని నిర్వహకుడు జిట్ట బాలకృష్ణారెడ్డికి దక్కుతుంది.తాను రాల్లేత్తిన రాజకీయ పక్షం సమీకరణల పేరుతో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వలేదు.పోటీ చేయడానికి ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ వైసిపి బిజెపి లాంటి పార్టీలను ఆశ్రయించాడు .జిట్టా ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి గౌరవం తప్పితే ఆ పార్టీ ద్వారా జిట్టాకు దక్కిన గౌరవం ఏమీ లేదు.యువత కు రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందని గ్రహించి కేవలం వృద్ధులు మాత్రమే రాజకీయాల్ని శాసిస్తూ యువతకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని తానే స్వయంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించాడు అప్పటికే రాజకీయాల్లో ఉన్నదంతా పోగొట్టుకున్న నేతగా తన పార్టీని ముందుకు తీసుకోలేకపోయాడు.
దీనికి తోడు నమ్ముకున్న చాలామంది మిత్రులు దూరం కావడం రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత పెరగడం తో జిట్టా రాజకీయాలకు దూరంగా జరగడం ఇలాంటి సంఘటనలు చివరి రోజుల్లో జిట్టా బాలకృష్ణారెడ్డిని కృంగదీశాయి. దీనికి తోడు అనారోగ్యం బారిన పడడంతో తన క్రియాశీల రాజకీయాలకు దూరం జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఏది ఏమైనా అన్ని రాజకీయ పార్టీలు జుట్ట బాలకృష్ణారెడ్డిని పీల్చి పిప్పి చేశాయి.నమ్ముకున్న టీఆర్ఎస్ నట్టేట ముంచడం మిగతా రాజకీయ పార్టీలు ఆయన ఇమేజ్ ను వాడుకోవడం తప్పితే ఆయనకు ఒరగబెట్టింది వన గూర్చింది ఏమీ లేదు.భువనగిరి ప్రాంతం నుండి ఎదిగొచ్చిన రావి నారాయణరెడ్డి కొమ్మిడి, నర్సింహారెడ్డి ,ఎలిమినేటి మాధవరెడ్డి ,సాంబశివుడు, బెల్లి లలిత పరంపరలో గొప్ప నేతగా జిట్టా బాలకృష్ణారెడ్డి శాశ్వతముద్ర వేయించుకున్నాడు .
భువనగిరి ప్రాంతానికి ఎంతో చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి ప్రాంతం మాత్రం శాశ్వతంగా రుణపడి ఉంటుంది. వ్యక్తులను వ్యక్తిత్వాలను అంచనా వేయకుండా పార్టీ బీ ఫామ్ లీడర్లకే ప్రాధాన్యత ఇస్తే కాంట్రాక్టర్లు,రియల్ ఎస్టేట్ కార్పొరేట్ కంపనీల పాలన రాజ్యం చేస్తుంది.ప్రజా నాయకులంతా జ్ఞాపకలకే మిగులుతారు.
దొమ్మాట వెంకటేష్
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.