బీసీలకు రాజకీయ పాలనాధికారం కేవలం ముఖ్యమంత్రులు గానో, మంత్రులు గానో పనిచేయటం ద్వారా మాత్రమే కాదు…రాజకీయంగా చట్ట సభల్లో జనాభా ప్రాతిపదికన సీట్ల వాటా పొందినప్పుడే మాత్రమే నిజమైన అభివృద్ధి జరుగుతుంది. ఏ సమానత్వ సమాజంలోనైనా అన్ని వర్గాల మధ్య అధికారం సమానంగా పంచబడాలి. ” మెజార్టీ ఈజ్ లా ” అన్నప్పుడు మెజార్టీ ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం ఎలా విజయం సాధించగలుగుతుంది. ఎస్సీ ఎస్టీలు 14% మరియు 7% రాజకీయ రిజర్వేషన్ల మూలన రాష్ట్రపతి, ఉపప్రధాని, లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి పదవుల దాకా వెళ్లే అవకాశం ఏర్పడింది, అయితే జనాభాలో మెజారిటీ ప్రజలు 56% ఉన్న బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేనందున వల్లనే నేటికి ఆ స్థాయికి చేరుకోలేక పోతున్నామన్న ఆవేదన ప్రతి బీసీ కులాల హృదయాల్లో ఉంది…
అదీ నుంచీ అవే ప్రలోభాలు.
దేశంలో ఉన్న దాదాపు 2600 బిసి కులాలలో స్వాతంత్ర్యం వచ్చిన ఈ 78 సంవత్సరాలలో కేవలం 65 కులాలు మాత్రమే పార్లమెంటు, అసెంబ్లీలో అడుగుపెట్టాయి. జనాభాలో 56% ఉన్నప్పటికి పార్లమెంటులో 15% కూడ బీసీల బలం లేదు. ఇందులో యూపీ, బీహార్ మరియు తమిళనాడు నుంచి బీసీ ఎంపీలే ఎక్కువ.. 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ కూడ లేకపోవడం గమనార్హం. మొదటి నుంచి కూడ చాలా ప్రధాన పార్టీలు వెనుకబడిన తరగతుల కోసం కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం, విద్య మరియు ఉద్యోగాలలో బొటాబొటి రిజర్వేషన్లు కల్పించడం, కొన్ని అప్రధానమైన శాఖలు ఇచ్చి తమ ప్రచారానికి వాడుకుని వదిలేస్తున్నాయి. ఇలాంటి చీప్ జిమ్మిక్కులు బీసీల సమస్యలను పరిష్కరించలేవు మరియు దేశ జనాభాలో 56% ఉన్న బీసీల వెనుకబాటుతనాన్ని తొలగించవు. రాజకీయ సీట్ల రిజర్వేషన్లు బీసీలకు అధికారానికి ప్రవేశ ద్వారం. కాబట్టి బీసీలకు రాజకీయ స్థానాల్లో రిజర్వేషన్లు తప్పనిసరి. వెనుకబడిన తరగతులకు సీట్లు రిజర్వ్ చేయబడని పక్షంలో బీసీ అభ్యర్థులు ఆర్థికంగా,ధన ప్రభావంతో, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మరియు సామాజికంగా కూడ చాలా బలంగా ఉన్న అగ్ర కులాల అభ్యర్థులతో పోటీ పడలేక మధ్యలోనే అపజయాలను మూటగట్టుకున్నారు.
శ్రమ మనది – సంపద వాళ్ళకు…
మన దేశం ఆకలి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరియు ఆరోగ్య వైపరీత్యాల వంటి బహుళ సంక్షోభాలతో వెనుకబడ్డ తరగతుల వారు బాధపడుతుండగా , భారతదేశంలోని అగ్రవర్ణాల బిలియనీర్లు మాత్రం బాగా అభివృద్ది చెందుతున్నారు… ఆయితే మరో పక్క భారతదేశంలోని పేదలు ముఖ్యంగా బీసీ కులాలు జీవించడానికి కనీస అవసరాలు కూడా నేటికీ కూడ పొందలేకపోతున్నారు.భారతీయ అసమానతపై 2023 ఆక్స్‌ఫామ్ నివేదిక సాధారణ పరిశీలన శక్తి ఉన్న ఎవరికైనా ఆశ్చర్యం కలిగించదు. భారత దేశ జనాభాలో 1 శాతం మంది జాతీయ సంపదలో 40.5 శాతం కలిగి ఉన్నారు.దేశంలోని మొత్తం వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్‌టి)లో దాదాపు 64% జనాభా దిగువన ఉన్న 50% ప్రజల నుండి వచ్చింది, అయితే 4% మాత్రమే టాప్ 10% నుండి వచ్చినట్లు నివేదిక పేర్కొంది, దేశంలో ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా 228.9 మిలియన్ల మంది పేదలు ఉన్నారు. నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 నుండి 2022 నాటికి 166కి పెరిగింది. మహమ్మారి నవంబర్ 2022 వరకు ప్రారంభమైనప్పటి నుండి, భారతదేశంలోని బిలియనీర్లు తమ సంపద రోజుకు 121 శాతం లేదా రూ. 3,608 కోట్లు పెరిగింది, భారతదేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రూ.54.12 లక్షల కోట్లకు చేరుకుంది, అనగా ఇది మొత్తం కేంద్ర బడ్జెట్‌కు ఒక ఏడాదిన్నర బడ్జెట్ కు పూర్తి నిధులు అందించగలదు.
పెరిగిపోతున్న అసమానత్వం…
భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగానే కాదు సుమా,అత్యంత అసమాన దేశాలలో కూడ ముందున్న దేశంగా పరిగణిస్తారు.దేశంలోని అట్టడుగు సంపదకు చెందిన వారిలో అత్యధిక శాతం అట్టడుగు వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం.భారతదేశంలో ఆరోగ్య వ్యయం భారీగా పెరిగిపోతోంది, జేబులో లేని వైద్య ఖర్చులు, పాఠశాల విద్యను భరించగలిగే స్థోమత కుటుంబ సామర్థ్యం కూడా వ్యక్తులను పేదరికంలోకి నెట్టివేస్తున్నాయి.వనరుల అన్యాయమైన పంపిణీ, సామాజిక,ఆర్థిక అసమానతలు,వారసత్వం ద్వారా సృష్టించబడిన సంపదలో అధిక భాగాన్ని ధనవంతులు చేతుల్లోకి వెళ్ళి పోవడం వల్ల బిసి పేదలు ఇప్పటికీ కనీస వేతనం కూడ సంపాదించలేక పోతున్నారు. దోచిదాచిపెట్టే అవినీతి రాజకీయ వ్యవస్థలు ములంగా బీసీల బతుకులు ఆగమాగం అవుతున్నాయి. పెరుగుతున్న ఈ అంతరాలు, అసమానతలు అసహనానికి దారి తీసే పెను ప్రమాదం లేకపోలేదు,
వాటా లేకపోతే ఎదుగలేరు…
విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదా వంటి అన్ని రంగాలలో బీసీలు అనాదిగా వివక్షకు గురవుతున్నారు. ఈ భారీ వివక్షను తొలగించేందుకు వెనుకబడిన తరగతులకు చట్టసభలు మరియు ప్రభుత్వ యంత్రాంగంలో రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయడం అధికారం మరియు హోదాను అనుభవించడం కోసం కాదు.వెనుకబడిన తరగతులు ధనిక ఉన్నత వర్గాలతో పోటీ పడాలని చెప్పడమే కాదు. సహజ న్యాయం కోసం పోటీ ఇద్దరు సమానుల మధ్య ఉండాలి మరియు అసమానతల మధ్య కాదు. వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే, వారు అభివృద్ధి చెందలేరు .
వెనుకబడిన తరగతులకు రాజకీయాలలో అధికార వాటా ఇవ్వకపోతే, ఈ వర్గాలు సామాజికంగా మరియు ఆర్థికంగా పురోగమించలేవు. ఆకలితో, పేదరికంతో బాధపడుతున్న వెనుకబడ్డ ప్రజలు, సమాజంలో వారి దీర్ఘకాల సమాన వాటాను కలిగి ఉండటం,జనాభాలో 56% ఉన్న వెనుకబడిన తరగతులు చట్టాల నిర్ణయంలో పాల్గొనడం ఏకైక అంతిమ లక్ష్యం సాధించేందుకు చట్టసభల్లో ప్రాతినిధ్యం చాలా అవసరం.లేకుంటే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా వెలుగొందాలన్న లక్ష్యం నెరవేరదు.
డాక్టర్.బి.వి.కేశవులునేత.ఎండీ.చీఫ్ న్యూరో-సైకియాట్రిస్ట్,
చైర్మన్:తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659.