కెసిఆర్ కూతురు కవిత తీహార్ జైలు నుంచి మొన్ననే విడుదలైన విషయం తెలిసిందే, అయితే ఈ కేసులో 166 రోజుల తర్వాత అయినా కవితకు కండిషన్స్ తో కూడిన బెయిల్ రావడం తెలిసిందే. ఈ సందర్భంగా ఇంత కీలక కేసులో కవిత తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది ఎవరు.. ఆయన ఫీజు ఎంత.. ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఎవరీ లాయర్ ముకుల్ రోహత్గీ?:
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రావడంతో ముకుల్ రోహత్గీ గురించిన చర్చ మరోసారి దేశవ్యాప్తంగా నడుస్తోంది. ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీలో ఎల్.ఎల్.బీ పూర్తి చేసిన రోహిత్గీ… అనంతరం ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ సబర్వాల్ దగ్గర ప్రాక్టీస్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.
ఈ క్రమంలో లాయర్ వసుధ రోహత్గీని వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిల్ రోగత్గీ, సమీర్ రోహత్గీ అని ఇద్దరు కుమారులున్నారు. ముకుల్ రోహత్గీని 1999 నవంబర్ లో ఐదేళ్ల పాటు భారత అడిషినల్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది భారత ప్రభుత్వం. అనంతరం 2014 నుంచి 2017 వరకూ భారత అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు.
ఈయన తన పదవీకాలంలో ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు, ఆధార్ కేసు వంటి పలు విజయవంతమైన కేసులను వాదించారు. ఈయన గతంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా హై ప్రొఫైల్ కేసులే ఈయన వాదిస్తారనే పేరు ఉందని అంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు బెయిల్ తెప్పించిందీ రోహిత్గీనే కాగా… గతంలో జగన్ కు బెయిల్ వచ్చేలా వాదించినవారిలో రాం జఠ్మలానీ తర్వాత ముకుల్ రోహత్గీదే కీలక పాత్ర అని చెబుతుంటారు.
ఈ క్రమంలో ఈయన గంటకు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు వరకూ ఫీజు తీసుకుంటారని చెబుతుంటారు. అది కేసు తీవ్రతపై ఆధారపడి ఉంటుందని అంటారు. ఈ క్రమంలోనే తాజాగా కవిత బెయిల్ విషయంలో ఆయన నిమిషానికి రూ.17 వేల చొప్పున ఫీజు వసూలు చేశారని చెబుతున్నారు.