Date 21-05-24.
గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,
హైదరాబాద్ గారికి.
విషయం; రైతులకు రూ. 500 బోనస్ హామీ అమలు గురించి విన్నపము.
ఆర్యా!
తమతో మనవి చేయునది ఏమనగా..దశాబ్ద కాలంగా ప్రభుత్వాలు ఏవి ఉన్నప్పటికీ రైతు పక్షపాతి అంటూనే రైతులను ఇబ్బంది చేస్తున్న సంఘటన కోకోల్లోలు.. ఈమధ్య అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడ రైతులకు కావాల్సిందల్లా చేస్తామని హామీలతో అధికారం లోకీ వచ్చింది. పట్టణ, నగర, మెట్రోపాలిటన్ ప్రాంతాలలోని ఎక్కువ స్థానాలను ఇతర పార్టీలే గెలుచుకోగా …గ్రామీణ తెలంగాణ లోని చాలా స్థానాలను కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన విషయం మరవద్దు. గ్రామీణ ప్రాంత రైతుల సమస్యల గురించి పోరాటం చేస్తున్న తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ గా రైతుల సమస్యలను మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.
రైతులు ఎంతైనా వడ్లు పండించుకోండి, రూ. 500 బోనస్ ఇచ్చి కొనే బాధ్యత నాది… అని సరిగ్గా నెల రోజుల క్రితం ఏప్రిల్ 21న నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల సభలో సాక్షాత్తు చెప్పినది మీరే కదా ! కానీ 20-05-24 రోజున క్యాబినెట్ మీటింగ్ తర్వాత సన్న వడ్లు పండించిన వారికి మాత్రమే రూ. 500 బోనస్ అని మీ సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం చాలా బాధాకరం. గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మేధావులు, ప్రజా సంఘాలు మీ దృష్టికి మళ్లీ తీసుకు వస్తున్నాయి, ప్రభుత్వ అధినేతగా మాట ఇచ్చి గౌరవించకపోవడం ఎంత మాత్రం మంచిది కాదని గుర్తు చేస్తున్నాను. ఈ ప్రకటనను వెంటనే ఉపసంహరించుకొని, సన్నవడ్లు ,దొడ్డు వడ్లు అనే తేడా లేకుండా రైతు పండించిన ప్రతీ కింటాల్ వడ్లకు రూ.500 బోనస్ వెంటనే ప్రకటించి రైతులను ఆదుకోవాలని, ఆదుకుంటారని ఆశిస్తూ…..
ఇట్లు,
మీ శ్రేయోభిలాషి.
డాక్టర్. బి. కేశవులు. ఎండీ
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం.