హైదరాబాద్ నడిబొడ్డున గల పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్లో ప్రజా భవన్ ముందు ఉన్న భారీ కేట్లు ఢీ కొట్టిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్ను పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబర్ 24న ఘటన జరిగిన తర్వాత దుబాయ్ పారిపోయాడు , అప్పటినుండి అతడి అరెస్టు కోసం పంజాగుట్ట పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. అయితే కేవలం పంజాగుట్టలో జరిగిన ప్రమాదమే కాకుండా గతంలో జూబ్లీహిల్స్లో చేసిన ప్రమాదం పైన కేస్ రీ ఓపెన్ చేశారు.
పోలీసులు జారీ చేసిన లూకౌట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాడు ఎమ్మెల్యే కొడుకు. తాను పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ లుక్ అవుట్ నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. కోర్ట్ ఆదేశాలతో దుబాయ్ నుండి హైదరాబాద్కు రావడంతోనే పంజాగుట్ట పోలీసులు అతనిని అరెస్టు చేసీ. నేరుగా కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషయల్ రిమాండ్లో ఉంచారు, ఇప్పుడు అతడిని కస్టడీకి కోరుతూ పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట ప్రమాదంతో పాటు గతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో చోటు చేసుకున్న ప్రమాదం పైన పోలీసులు అతనిని విచారించనున్నారు,ఇప్పటికే ఈ రెండు ప్రమాదాలపై పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. ఈ రెండు ప్రమాదాలను చేసింది మాజీ ఎమ్మెల్యే కొడుకు రాహిల్గా పోలీసులు నిర్ధారించారు.
అయితే కేసు నుండి తప్పించుకునేందుకు తనకు బదులుగా తన డ్రైవర్లను పోలీసుల ముందు లొంగిపోయేలాగా ప్రేరేపించాడు, తనకు బదులు డ్రైవర్ని పంపించడం కూడా నేరంగా పరిగణిస్తున్నారు, ఇప్పటికే అరెస్ట్ అయిన డ్రైవర్ల నుండి పోలీసులు మరోసారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ముందు పొందుపరిచిన వాంగ్మూలంలో రెండుసార్లు ప్రమాదానికి కారణమైంది మాజీ ఎమ్మెల్యే కొడుకు రాహిల్గా వారు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు,.