ప్రజలను ఎలా మోసం చేయాలో, అసలు విషయాలను డైవర్ట్ చేసి రాజకీయ పబ్బం ఎలా గడుపాలో రాజకీయ పార్టీలకు, వాటి నాయకులకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే అది వారి వృత్తి. గత ఎన్నికల ముందు పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల పంటలకు సరైన ధరలు అవినీతి లాంటి సమస్యలన్నీ ఎన్నికల సమయంలో చర్చకు లేవనెత్తబడ్డాయి, ఈ సమస్యలపై ప్రభుత్వాలు ఏర్పడటమో, దిగిపోవడమో జరిగి ఉండేవి. ఒకప్పుడు ఉల్లి ధరపై ఎంత రచ్చ జరిగిందో , ఆనాటి ఎన్నికలో ఏమీ జరిగిందో తెలియదు కాదు. కానీ రాజకీయాల్లో తెలివైన రాజకీయ ఆటగాళ్ళు ఎన్నికల రంగంలో ఉండి, ప్రజల మనస్సుల నుండి అసలైన సమస్యలను అదృశ్యం చేయటం లేదా పక్కదారి పట్టించడం ఒక అంతు చిక్కని ఆనవాయితీగా వస్తూంది. విలువ లేని రాజకీయాలు,సామాజిక మూలాలు మరచిన ఆర్థిక అభివృద్ధి, పేరుకుపోయిన అవినీతి పైన చర్చలు, విమర్శలు లేకుండా సంబంధం లేని అంశాలపై ఎన్నికల గోదాములో పోరాడటం భవిష్యత్త్ తరాలకు, దేశానికి ఏ మాత్రం క్షేమకరం కాదు.
నోట్లు.. సీట్లు..కోట్లు….,
రాజకీయ పరిభాషలో మన రాజకీయాల గురించి చెప్పాలంటే ….. నోట్లు ఖర్చు పెట్టి సీటు గెలవడం, గెలిచాక కోట్లు పోగు చేసుకోవడానికే అధికారాన్ని వాడుకోవడం. ఇదే నేటి ఆధునిక రాజకీయం. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు, విధేయతలు లేవు, విశ్వసనీయత అనే మాటకి అర్థం పరమార్ధం తెలియదు.నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించి పనిచేయాల్సిన ప్రభుత్వాలు, నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తుండడంతో మనం చాలా రంగాల్లో నష్టపోతున్నాం. అప్పుచేసో, ప్రభుత్వ ఆస్తులు అమ్మేసో, వచ్చిన డబ్బుని సగం దోచేయడం, మిగిలిన సగాన్ని ఏదో ఒక పథకం పేరుతో ప్రజలకి పంచి పెట్టడం ఇదే ఇప్పుడు పరిపాలన నడుస్తున్న తీరు. రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్ లాంటి మౌలిక వసతులు కల్పించడం, ప్రజలకి విద్య, ఆరోగ్యం అందించడం, శాంతిభద్రతలు కాపాడడం. ఓట్ల వేటలో పడిన ప్రభుత్వాలు, ఇవీ తప్ప మిగిలినవన్ని చేస్తున్నాయి. అన్ని వృత్తులు, రంగాలలోకి కార్పొరేట్ సంస్థలు వచ్చేసాయి. దీనితో 80% జనాభాకి ఎదిగే అవకాశాలు దూరం అవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు తక్షణ అవసరాల నిమిత్తం తాత్కాలిక ఉపశమనం వెైపు మొగ్గుచూపడం కూడ ప్రజాస్వామ్యం క్షీణతకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
బాధ్యతను మారుస్తున్న ప్రజలు…
సాధారణ ప్రజలకు అసలు సమస్యలపై అవగాహన లేదు కాబట్టి, పెట్రోల్, డీజిల్, పప్పుదినుసుల లాంటి వస్తువుల ధరల గురించి ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో కూడ లేరు, విచిత్రంగా ధర అడగకుండానే ప్యాకెట్‌పై రాసి ఉన్న ధరను ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ డబ్బు బదిలీ చేయడం ప్రారంభించినప్పటి నుండి, ప్రజలు ద్రవ్యోల్బణాన్ని అనుభవించడం మానేశారు. దేశం, సమాజం ఏమైనా కానీ, ఏటైనా పోనీ, నేను, నా కుటుంబం బాగుంటే చాలు అనే ధోరణి దేశంలో బాగా పెరిగిపోయింది. దేశాన్ని మార్చడం అసాధ్యం అనే నిరాశ, ఏ నాయకుడిని నమ్మలేని అవిశ్వాసం, దేశం ఇలాగే ఉంటే మన తర్వాతి తరాలు ఎంత నష్టపోతాయో అనే ఆలోచన లోపించడం, డబ్బు ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు అనే భావన పెరిగిపోవడం, కులం, మతం, ప్రాంతీయతల వెైపు మొగ్గడం, వీటన్నిటికి కారణంగా ప్రజలు సమాజం గురించి, పాలన గురించి పట్టించుకోవడం మానేసి, రాజకీయాలని ఒక IPL మ్యాచ్ లాగా భావిస్తున్నారు.నిజానికి ప్రజలు ఇప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్ లేదా సోషల్ మీడియాకు బానిసలుగా మారారు. ఎన్నికల ప్రచారాలు, ప్రసంగాలు, సంబంధాలు కూడా ఇప్పుడు ఫేస్‌బుక్‌గా మారిపోయాయి. ఈ కారణంగానే తెలివైన నాయకులు అసలు సమస్యలు గూర్చి చర్చించడం మానివేశారు. ప్రజలకు పట్టింపు లేనప్పుడు, ద్రవ్యోల్బణం ఎలా సమస్య అవుతుంది? యువతకు ఉద్యోగ పోరాటం తెలియనప్పుడు నిరుద్యోగం ఎలా మండుతుంది? ఎవరికీ పట్టనట్టు అవినీతి ఎక్కడికక్కడే కలిసిపోయింది.
మ్యానిఫెస్టోల… ?
ఎన్నికల సమయంలో ప్రతి పార్టీకి ఆ పార్టీల మేనిఫెస్టో రాజ్యాంగం లాంటిది అలాంటి మేనిఫెస్టోలో ఏమి చేయబోతున్నారో వివరంగా స్పష్టంగా ప్రజలకు తెలియపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మానిఫెస్టోల గురించి మాట్లాడితే కనీసం 1980 లలో లేదా 90 వ దశకం ప్రారంభంలో రాజకీయ పార్టీల మేనిఫెస్టోను చదివినప్పుడు అవి ఖచ్చితంగా ఉండేవి. ప్రస్తుతం మీరు ఏదైనా రాజకీయ పార్టీ మ్యానిఫెస్టోను పరిశీలించండి అది పదుల సంఖ్యలో పేజీల్లో ఉంటుంది. దాన్ని ఎవ్వరు చదువడం లేదు, చదివినా అర్థం కాని, సాధ్యం కాని విషయాలను లిఖించుతారు. చివరికి రాజకీయ పార్టీలుకూడ తమ మేనిఫెస్టోలను సైతం ప్రజలు చదవాలని కోరుకోవడం లేదన్నది నగ్నసత్యం.అందుకే ఎన్నికల్లో ఇప్పుడు అసలు సమస్యలు గూర్చి ప్రస్తావనలు లేవు, వోట్ల గణితం బాగానే ఉంటే అభ్యర్థి గెలుస్తాడు, లేకపోతే ఓడిపోతాడు.
అసలు సమస్యలు …
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం దాని మొత్తం జనాభాకు సరైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించలేదనేది నిజం. భారతదేశం మెడికల్ టూరిజానికి కేంద్రంగా మారుతోంది, అయితే ఈ సౌకర్యాలన్నీ స్థానిక నివాసితులకు, పేదలకు అందుబాటులో లేవు.మొత్తం గ్రామస్థులలో 50% మందికి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ప్రవేశం లేదు,10% మంది పిల్లలు పుట్టిన ఒక సంవత్సరంలోనే మరణిస్తారు, పోషకాహార లోపం వల్ల 50% మంది పిల్లలు విపరీత అనరగలకు అనారోగ్యాలకు గురవుతున్నారు.ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 42% తక్కువ బరువుతో ఉన్నారు.నిరక్షరాస్యత స్థాయి ప్రపంచ సగటు అక్షరాస్యత రేటు 84% కంటే చాలా తక్కువగా ఉంది,భారతదేశ విద్యా వ్యవస్థ చాలా సైద్ధాంతికంగా ఉంది కానీ ఆచరణాత్మకమైనది మరియు నైపుణ్యం ఆధారితమైనది కాదు,విద్యార్థులు మార్కులు కొట్టేందుకే చదువుతారు తప్ప జ్ఞానం కోసం కాదు. ప్రస్తుతం అత్యధిక నిరక్షరాస్యుల జనాభాను కలిగి వున్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో నిరుద్యోగం ప్రధాన సమస్య ఇప్పటికి 80 % మంది అసంఘటిత రంగంలో ఉన్నారు.మరియు భారతదేశంలోని మొత్తం జనాభాలో 37% మంది అంతర్జాతీయ దారిద్య్ర రేఖకు దిగువన అనగా ప్రపంచంలోని మూడవ వంతు పేదలు భారతదేశంలో నివసిస్తున్నారన్నమాట. దేశంలో అత్యంత విస్తృతంగా వ్యాపించిన స్థానిక వ్యాధి అవినీతి, దీనిని త్వరగా మరియు తెలివిగా నియంత్రించాలి. ప్రైవేట్, ప్రభుత్వ రంగంలో ఈ వ్యాధి బారిన పడని ఏ కార్యాలయం ఏ కోశానా కనపడదు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ ఎంత నష్టపోయిందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే సహజ వనరులను దుర్వినియోగం చేయడాన్ని మనం ఆపకపోతే కాలుష్యం భారీ నిష్పత్తికి చేరుకుని పర్యావరణ వ్యవస్థను నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇవ్వన్నీ భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వీటి పైన చర్చలు విమర్శలు లేకుండా సంబంధం లేని అంశాలపై ఎన్నికల గోదాములో పోరాడటం అవివేకం.
డాక్టర్. బి.కేశవులు. ఎండి. సైకియాట్రీ.
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659.